షారుఖ్ ఖాన్ కుమారుడి డ్రగ్స్ కేసులో హీరోగా ప్రశంసలు పొందుతున్న సమీర్ వాంఖడేపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అసలు క్రూయిజ్ పై దాడి చేసినప్పుడే ప్రైవేటు వ్యక్తులను తీసుకెళ్లి .. వాళ్లని సాక్షులుగా చూపించారు. ఇప్పుడు ఆ సాక్షుల్లో ఒకరు వాంఖడేపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కోర్టులోనే పిటిషన్ వేశారు. ఆయన తన వద్ద సాక్షి స్టేట్మెంట్ పత్రాల కోసం ఐదు బ్లాంక్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ మొత్తం కేసు కుట్ర పూరితమైనదని.. రూ. కోట్లలో వసూళ్లకు పాల్పడుతున్నారని సమీర్ వాంఖడే బృందం సాక్షిగా చెప్పిన ప్రభాకర్ సెయిల్ ప్రకటించారు.
ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కొంత మంది ఆయనతో సెల్ఫీలు దిగారు. వీడియోల్లోనూ మరికొంత మంది కనిపించారు. అసలు వీరెవరు అన్నదానిపై సోషల్ మీడియా ఆరా తీసింది. చివరికి వారిలో ఒకరు బీజేపీ నేత కాగా.. మరొకరు ఇండిపెండెంట్ డిటెక్టివ్‌గా ప్రచారం చేసుకునే మరో వ్యక్తి ఉన్నట్లుగా తేలింది. అసలు ఎన్సీబీ ఆపరేషన్లోకి వాళ్లెందుకు వచ్చారన్న దుమారం రేగడంతో వారు సాక్షులని ఎన్సీబీ అధికారులు చెప్పడం ప్రారంభించారు. వీరిలో ప్రైవేటు డిటెక్టివ్ గోసవి అనే వ్యక్తి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన ద్వారానే వాంఖడే డబ్బుల డీల్స్ చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
షారుఖ్ ఖాన్ కుమారుడిగా సెలబ్రిటీగా ఆర్యన్‌కు వస్తున్న పబ్లిసిటీనో .. లేక మరో కారణమో కానీ విచిత్రంగా మూడు సార్లు బెయిల్ కూడా తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితి గతంలో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన వారికి లేదు. కానీ ఆర్యన్ వాట్సాప్ చాట్‌ను బయటకు తీసి.. దాంట్లో ఉన్న వారందర్నీ పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఆయన గురించి మీడియాకు లెక్కలేనన్ని లీకులు ఇస్తున్నారు. అలా చెప్పారని.. ఇలా చేశారని అందులో ఉంటోంది. ఈ పరిణామాలతో సమీర్ వాంఖడే నిజాయితీపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొసమెరుపేమిటంటే వాంఖడే భార్య ఓ నటి.. ఆమె ఐపీఎల్ ఫిక్సింగ్ స్కాంలోనూ ఆమె పేరు వినిపించింది.