తెలంగాణలో పాదయాత్ర చేస్తునన వైఎస్ షర్మిల ఒంటరిగానే కనిపిస్తున్నారు. వైఎస్ కుటుంబసభ్యుల్లో ఎక్కువ మంది యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కానీ ప్రముఖులు మాత్రం ముఖ్యంగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్న వారెవరూ రావడం లేదు. సహజంగా పాదయాత్ర చేస్తే ఓ ప్రణాళిక ప్రకారం అందర్నీ పరామర్శలకు పిలుస్తూ మీడియా కవరేజీ వచ్చేలా చేసుకుంటారు. కానీ షర్మిలకు మాత్రం అలాంటి ఆదరణ కనిపించలేదు. అయితే హఠాత్తుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి షర్మిల పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు.
హైదరాబాద్ శివారులో జరుగుతున్న పాదయాత్రలో పాల్గొని ఆమెను పరామర్శించారు. వైవీ సుబ్బారెడ్డి షర్మిలకు కూడా బాబాయే. ఆయన కుటుంబసభ్యునిగా పరామర్శించారా లేక వైసీపీ తరపున వచ్చి పరామర్శించారా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇలా వచ్చి కలిసే అవకాశం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్రపై ఏపీ ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదికను.. ఇన్‌పుట్స్‌ను సుబ్బారెడ్డి షర్మిలకు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
పాదయాత్ర ఏకంగా నాలుగు వందల రోజుల పాటు నిర్వహించాలనుకోవడం .. ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటం వంటి వాటిని వివరించి.. పునరాలోచన చేయాలని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కుటుంబసభ్యునిగా పరామర్శకు మాత్రమే కాకుండా ఇతర అంశాలపై మాట్లాడేందుకు వచ్చి ఉన్నట్లయితే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంశంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.