జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జిల్లాల పర్యటనలకు షెడ్యూల్ ఖరారు చేసుకునే ప్రణాళికలో ఉన్నారు. జిల్లాల పార్టీల అధ్యక్షులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. తమ పార్టీ నిర్వహించిన శ్రమదానం కార్యక్రమానికి ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చిందని… ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికీ తీసుకువెళ్లామని పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చిందన్న పవన్..రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా ఆ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను శ్రమదానంతో బాగుచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నామని జిల్లాలకు వెళ్లినప్పుడు అక్కడ.. పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తామని పవన్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకొంటూ ముందుకు తీసుకువెళ్లాలని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జిల్లా అధ్యక్షులకు సూచించారు. పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేసి వారికి శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన కూడా యాక్టివ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలు జనసేన పార్టీలో ఊపు తీసుకు వచ్చాయి. తర్వాత కార్యక్రమం ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోవడంతో మళ్లీ స్తబ్దత ఏర్పడింది. దీంతో జిల్లాల పర్యటనలకు పవన్ కల్యాణ్ సన్నాహాలు చేసుకుంటున్నారు.