సంక్రాంతి బరిలోకి RRR దిగడంతో… సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ సంక్రాంతికి భీమ్లా నాయక్, ఎఫ్ 3, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ ముందుగానే కర్చీఫ్ లు వేసుకున్నాయి. అయితే సడన్ గా RRR ఎంట్రీ ఇవ్వడంతో గేమ్ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. RRR.. పాన్ ఇండియా సినిమా. రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్… ఈ పేర్లు చాలు. బాక్సాఫీసుకి పూనకం వచ్చేయడానికి. బాహుబలి తరవాత అంతటి క్రేజీ ప్రాజెక్టు కావడంతో మిగిలిన సినిమాలు RRR తో పోటీ పడడానికి జంకు తున్నాయి. ఎప్పుడైతే.. RRR రిలీజ్ కి రెడీ అయ్యిందో.. మిగిలిన సినిమాలు దారి ఇవ్వడం మొదలెట్టాయి.
ఎఫ్ 3 రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించేసింది. ఈ సినిమాని ఫిబ్రవరి 25కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్, సర్కారు వారి పాట కూడా అదే దారిలో వెళ్లబోతున్నాయి. సర్కారు వారి పాటని వేసవి బరిలో నిలిపే ఛాన్సుందని సమాచారం. భీమ్లా నాయక్ ఉగాదికి విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే.. ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. జనవరి 26 కూడా ఓ ఆప్షనే. మొత్తానికి సంక్రాంతి పోటీ నుంచి ఈ రెండు సినిమాలూ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక RRR కి పోటీ ఇచ్చేది ఒక్క రాధే శ్యామ్ మాత్రమే. కొత్తగా వచ్చిన టీజర్ లో జనవరి 14న విడుదల అంటూ… సమరశంఖం ఊదేసింది రాధేశ్యామ్. కాకపోతే…. యూవీ క్రియేషన్స్ ని పెద్దగా నమ్మడానికి లేదు. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. ఆ తరవాత వాయిదా వేశారు. దాంతో సంక్రాంతి విడుదల అన్నా…. ఎవరూ పెద్దగా నమ్మడం లేదు. కాకపోతే… RRR జనవరి 7న వస్తుంది. రాధేశ్యామ్ రావడానికి మరో వారం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ సరిపోతుంది కూడా. దాంతో పాటు సంక్రాంతి పెద్ద సీజన్. రెండు సినిమాలకు గ్యారెంటీగా చోటుంటుంది. కాబట్టి.. రాధేశ్యామ్ పోటీ పడే అవకాశాలే ఎక్కువ.