`మా` అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించారు మంచు విష్ణు. వీలైనంత త్వరగా తన మార్క్ ని చూపించాలని తాపత్రయపడుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాలన్నది విష్ణు ఆలోచన. బై లాస్ లో ఎలాంటి విషయాలున్నాయి…? అవి ఎలా దుర్వినియోగపడుతున్నాయి? అనే విషయంపై విష్ణు దృష్టి పెట్టారు. ఈలోగా.. `మా` సభ్యుల మనసు గెలుచుకునే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా యూ ట్యూబ్ ఛానల్స్ పై దృష్టి సారించారు. కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ తమ వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. పైన హెడ్డింగ్ ఒకటి, లోపల మాటర్ మరోటి అన్న చందాన తయారైంది వ్యవహారం. నటీనటుల ప్రతిష్టకు, వాళ్ల గౌరవానికి భంగం కలిగిస్తూ కొన్ని విచ్చల విడి హెడ్డింగ్స్ పెడుతున్నాయి. అంతేకాకుండా.. అసలు ఎలాంటి ఆధారాలు, నిజాలూ లేకుండా పుకార్లని ప్రచారం చేస్తున్నాయి. వాటికి అడ్డు కట్ట వేయాలన్నది విష్ణు ఆలోచన. అందులో భాగంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి, యూ ట్యూబ్ ఛానళ్ల వ్యవహారాల తీరు పరిశీలించి, వాటికి అనుగుణంగా కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ పై కేసు వేయాలని డిసైడ్ అయ్యాడు విష్ణు. యూ ట్యూబ్ ఛానళ్ల పై ఫిర్యాదుల్ని స్వీకరించి, న్యాయవాదుల ద్వారా కోర్టులో పిటీషన్ వేయాలని చూస్తున్నారు.
యూ ట్యూబ్ ఛానళ్ల అడ్డగోలు హెడ్డింగులు, రూమర్లతో చాలామంది నటీనటులు వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఇబ్బంది పడ్డారు. వాళ్లందరి నుంచీ ఫిర్యాదులు సేకరించడం మొదలెట్టారు. విష్ణు ఆలోచన బాగుంది. కాకపోతే.. యూ ట్యూబ్ ఛానళ్లపై నియంత్రణ చాలా కష్టం. ఇప్పటికే ఈ విషయంలో చాలామంది నటీనటులు కోర్టు మెట్లు ఎక్కారు. కానీ సరైన ఫలితాలు రాలేదు. ఆమధ్య సమంత కూడా కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లపై కేసు వేసింది. అయితే ఒకటి మాత్రం నిజం. యూ ట్యూబ్ ఛానళ్లు తమ వ్యూస్ కోసం అడ్డగోలు హెడ్డింగులు పెట్టడం కాస్త ఆగుతుంది. వాటిపై ఒకరు దృష్టి పెట్టడం ఎప్పుడూ మంచిదే. కానీ ఆచరణలో ఎంత వరకూ సాధ్యమో ఆలోచించుకోవాలి.