ఈటల రాజేందర్‌ను అంత అకస్మాత్‌గా పార్టీ నుంచి బయటకు పంపాల్సిన అవసరం ఏమిటి..? ఆయన రాజీనామా చేస్తే తక్షణం ఆమోదించేసి సాయంత్రానికి గెజిట్ విడుదల చేసి ఉపఎన్నిక తెచ్చుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది..?. అంతా అయిపోయాక డిఫెన్స్ ఎందుకు ఆడాల్సి వచ్చింది ? సర్వశక్తులు ఒడ్డి .. వేల కోట్లు గుమ్మరించి ఇప్పుడు పరాజయం పాలయ్యాక..ఈ పతనాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాల్సి ఉంటుంది..?
ఈ వైఫల్యం వంద శాతం కేసీఆర్‌దే !
అవసరం లేని చోట ఉపఎన్నిక తేవడం దగ్గర నుంచి టీఆర్ఎస్ ఓడిపోవడం వరకూ ప్రతి విషయంలో వ్యూహాత్మక తప్పిదాలను టీఆర్ఎస్ చేసింది. దీని పూర్తి బాధ్యత కేసీఆర్ దే. ఇంత కాలం తనతో నడిచిన నేతను..కేసులు పెట్టి బయటకు పంపేయడంతోనే ఈటల విజయానికి ఆయన బాటలు వేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా కళ్ల ముందే ఉంది. టీఆర్ఎస్ విషయంలో ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి వాళ్లకు జరిగిన అవమానమే ఈటలకు జరిగింది. కానీ అప్పటి పరిస్థితులు రిపీట్ కాలేదు. రివర్స్ అయ్యాయి.
రూ. పది లక్షలిస్తామన్నా నమ్మలే.. ఇక ఎలా ?
ఇంటికి రూ. పది లక్షలు ఇస్తామన్నా తెలంగాణ రాష్ట్ర సమితిని హుజురాబాద్ దళిత ఓటర్లు నమ్మలేదు. చివరికి దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన శాలపల్లి గ్రామంలోనూ టీఆర్ఎస్కు మెజార్టీ రాలేదు. హుజురాబాద్ మొత్తం దళిత బంధు ఇస్తామని చెప్పిన కేసీఆర్ రూ. రెండు వేల కోట్లను విడుదల చేశారు. అయితే ఎన్నికలకు మూడు నెలల సమయం ఉన్నా దళిత బంధు యూనిట్లు పంపిణీ చేయలేకపోయారు. ఈ కారణంగానే ఓటర్లు నమ్మలేకపోయారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆడిన రూ.పదివేల గేమ్ అందరికీ గుర్తుంది. మధ్యలో సాయాన్ని ఆపేసి.. ఎన్నికలవగానే అందరికీ ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు దళిత బంధును కూడా మధ్యలోనే ఆపేసి..ఎన్నికలయిన తర్వతా ఇస్తామన్నారు. కానీ ప్రతీ సారి ప్రజలు నమ్మలేరుగా..!
రూ. వేల కోట్ల ఖర్చు.. నేతల చేరికలతో మరిన్ని తప్పిదాలు !
కేసీఆర్ హుజురాబాద్ ఉపఎన్నికను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు. దళిత బంధుకు రూ. రెండు వేల కోట్లు విడుదల చేశారు. మరో పదిహేను వందల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభఇంచారు. పార్టీ పరంగా చేసిన ఖర్చుకు లెక్కే లేదు. అందరికీ కండువాలు కప్పడానికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించారు. ఈటలను ఒంటరి చేయడానికి పెట్టిన ఖర్చు అంతా ఇంతా కాదు. అలాగే ఇతర పార్టీల ప్రముఖ నేతల్నీ వదలకుండా చేర్చుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి, ఎల్.రమణ, ఇనుగాల పెద్దిరెడ్డిలతో పాటు పదుల సంఖ్యద్వితీయ శ్రేణి నేతలకు కండువాలు కప్పారు. హుజురాబాద్ నియోజకవర్గానికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
హరీష్‌ను బలిపశువు చేసే ప్లాన్ అనే చెడ్డ పేరు !
పార్టీలో కేటీఆర్ ప్రభ పెంచాలని కేసీఆర్ నిర్ణయించుకున్న తర్వాత హరీష్ రావును పక్కన పెట్టేశారు. ఆయనను ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేశారు. అయినా హరీష్ ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కేటీఆర్ హుజురాబాద్ బాధ్యతలు తీసుకోలేదు. కనీసం ప్రచారానికిర ాలేదు. కానీ హరీష్‌కు మాత్రం పిలిచి బాధ్యతలిచ్చారు. అక్కడే టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది. కేసీఆర్ ఇచ్చిన బాధ్యతల్ని హరీష్ శక్తివంచన లేకుండా నెరవేర్చేందుకు ప్రయత్నించారు. హుజూరాబాద్‌లోనే మకాం వేసి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కానీ అక్కడ ప్రజల ఆలోచన ముందు రాజకీయం ఓడిపోయింది.
ఈ పతనం ఆగాలంటే మాటలు కాదు చేతలు ఉండాలి !
కేసీఆర్ ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఎంత ఆలస్యం అయితే అంత వ్యతిరేకత పెరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా కేసీఆర్ వచ్చేఏడాది డిసెంబర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ లోపు ఆయన చాలా వరకూ విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. కేసీఆర్ మాటలు విని విని ప్రజలు అలసిపోయారు. ఇప్పుడు చేతల్లో చెప్పినవి చేసి చూపించాల్సి ఉంది.అప్పుడు మాత్రమే ఆయనపై మళ్లీ విశ్వాసం పెరిగే చాన్స్ ఉంది.