అమెరికాలో ఉండి ఇండియాలో న్యాయవ్యవస్థను సైతం సవాల్ చేస్తున్న పంచ్ ప్రభాకర్ విషయంలో సీబీఐ తీరు అనేక అనుమానాలకు కారణం అవుతోంది. ఎంత హెచ్చరిస్తున్న కనీసం అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేయలేదు. దీంతో సీబీఐ పనితీరుపైనే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరికి పది రోజుల డెడ్ లైన్ పెట్టింది. అసలు హైకోర్టు మూడు రోజులే ఇస్తామన్నది కానీ పది రోజులు ఇవ్వాలని సీబీఐ కోరింది అందుకే ఆ మాత్రం గడువు ఇచ్చింది. సీబీఐ అధికారులు పంచ్ ప్రభాకర్ అడ్రస్ దొరకలేదని.. మరొకటని ఇంత కాలం కబుర్లు చెబుతూ వచ్చారు.
కానీ ఆయనే నేరుగా తన ఫోటో, ఇళ్లు, పశు వైద్యునిగా పని చేస్తున్న ఆస్పత్రి అడ్రస్‌లను కూడా పోస్ట్ చేశారు. ఏం చేయగలరో చేసుకోమని సవాల్ చేశారు. దీంతో ఇప్పుడు ఆయనను పట్టుకుని తీరాల్సిన అవసరం సీబీఐపై పడింది. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశామని మరొకటని కబుర్లు చెబుతున్నారు కానీ.. అసలు ఇంత వరకూ పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసే ప్రయత్నాలే చేయలేదు. ఇప్పుడు పది రోజుల సమయం సీబీఐ అడిగింది. అరెస్ట్ చేయకపోతే సీబీఐ సామర్థ్యం, నిజాయితీపైనే అందరికీ అనుమానం వస్తుంది.
అసలు సీబీఐ ఎందుకు పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయలేకపోతోందనేది మరో సస్పెన్స్ గా మారింది. ఆయన దొరికితే.. మొత్తం న్యాయవ్యవస్థను టార్గెట్ చేసుకున్న కుట్ర వెనుక అసలు వ్యక్తులు బయటకు వస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలా జరగకుండా ఉండాలంటే ఆయన దొరకకుండా చూసుకోవాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి తీసుకు వస్తే ఆయనపై అనేక కేసులు పడే అవకాశం ఉంది. చివరికి రాజ్యసభ చైర్మన్‌ను కులం పేరుతో దూషించిన కేసు కూడా ఢిల్లీలో ఉంది.