తెలంగాణ రాష్ట్ర సమితికి టైం బ్యాడ్ అంటే ఏమిటో తెలిసి వస్తోంది. హుజురాబాద్ ఓటమిని మర్చిపోయేందుకు భారీగా విజయగర్జన సభను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఆ పార్టీకి స్థలం దొరకడం కష్టమైపోతోంది. వరంగల్లో సభ నిర్వహిచాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఓ చోట ఫిక్స్ చేసుకుని పరిశీలనకు అక్కడకు వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది.
ఎందుకంటే అక్కడ రైతులు పంటలు వేసుకున్నారు. పత్తి పంట మధ్యలో ఉంది.ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ సభ నిర్వహిస్తే పంట అంతా నాశనం అయిపోతుంది. దాదాపుగా యాభై మంది రైతు పొలాలు పాడైపోతాయి. వారంతా ఇతర రైతుల్ని తీసుకుని వచ్చి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్ని అడ్డుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ విజయ గర్జన నిర్వహించడానికి అంగీకరించబోమని తేల్చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతులకు ఎంత నచ్చ చెప్పినా.. నష్టపరిహారం ఇస్తామన్నా వారు వెనక్కి తగ్గలేదు .
సభ పెట్టడానికి ఒప్పుకోబోమని తేల్చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలు అక్కడే సభ నిర్వహించాలని ఇంకా నిర్ణయించలేదని.. వేదికను ఫైనల్ చేయలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఒకప్పుడు టీఆర్ఎస్ సభ అంటే తమ పొలాలు తీసుకోవాలనిరైతులు పోటీ పడేవారు. ఇప్పుడు తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.