పెట్రోల్ వాతలు పెట్టి, పెట్టి చివరికి దీపావళి కానుక అంటూ కాస్త వెన్న పూసారు ప్రధానమంత్రి నరేంద్రమోడి. దీపావళి సందర్భంగా ప్రజలకు కానుకలు అంటూ గొప్పగా ప్రకటించి పెట్రోల్‌పై రూ.ఐదు, డీజిల్‌పై రూ. పది తగ్గిస్తున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ తగ్గింపులు అమల్లోకి వస్తాయి. కరోనా మొదటి వేవ్ లాక్‌డౌన్‌కు ముందు రూ. 70కి రూ. 80కి మధ్య ఉన్న పెట్రోల్ రేటు ఏడాదిన్నరలోనే రూ. 35 పెంచేశారు.
చివరికి ఇప్పుడు అటూ ఇటూగా రూ. 115 దగ్గర తేలుతోంది. దీని నుంచి రూ. ఐదు తగ్గించి దీపావళి కానుక అని ప్రకటించేశారు మోడీ. డీజిల్ రేటును రూ. పది తగ్గించారు. కానీ ఈ పెట్రో ఉత్పత్తుల ధరల వలన పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరల గురించి కేంద్రం కనీసం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఏడాదికి ప్రజల వద్ద నుంచి కేవలం పెట్రో పన్నుల ద్వారానే రూ. మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల ఆదాయం పొందుతోంది.
ఈ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారే కానీ ప్రజల మీద కాస్త భారం తగ్గిద్దామని అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం రూ. ఐదు తగ్గించి.. అదేదో పెద్ద కానుకన్నట్లుగా ప్రకటించుకుంటోంది. అయితే అసలు కన్నా ఏదో ఒకటి నయం అన్నట్లుగా కనీసం ఐదు రూపాయలు అయినా తగ్గించారని సంతోషపడటం తప్ప సామాన్యుడు చేయగలిగిందేమీ లేదు.