చిన్న సినిమాల నుంచి పెద్ద స్థాయికి వెళ్లిన దర్శకుడు మారుతి. తన కాన్సెప్టులు, కథలు, చెప్పే విషయాలూ గమ్మత్తుగా ఉంటాయి. దేన్నయినా వినోదపు పూత పూసి చెప్పడం మారుతి స్టైల్. ఈసారి `భయం` అనే పాయింట్ పట్టుకున్నాడు. భయమే.. అతి పెద్ద జబ్బు అని చెబుతూ, దానికి తన స్టైల్ కామెడీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి ఈ దఫా మారుతికి మళ్లీ విజయం దక్కిందా? మంచి రోజులొచ్చాయిలో మంచి, చెడులేంటి?
సంతు (సంతోష్ శోభన్), పద్దు (మెహరీన్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. పద్దు.. తండ్రి గోపాలం (అజయ్ ఘోష్)ని భయాలెక్కువ. దానికి తోడు పక్కింట్లో ఉండే మూర్తి, కోటేశ్వరరావు అనే ఇద్దరు ఈ భయం అనే వీక్ నెస్ పాయింట్ పై గోపాలంతో ఆడుకుంటుంటారు. తన కూతురు ప్రేమలో పడిపోయిందని, ప్రేమలో పడి మోసపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు గోపాలం. సంతూని చూడకుండానే… రిజెక్ట్ చేస్తాడు. పద్దుకి పెళ్లి సంబంధాలు వెదుకుతుంటాడు. అయితే అవన్నీ ఏదో రూపంలో చెడిపోతూ ఉంటాయి. మరోవైపు గోపాలానికి చావు భయం పుట్టుకొస్తుంది. తన స్నేహితుడు మూర్తి చనిపోతే.. మూర్తిలానే నేను చనిపోతానేమో అని అనుక్షణం భయపడుతూ ఉంటాడు. కాబోయే మామగారిలో ఈ భయాలన్నీ పోగొట్టి, పద్దూని ఎలా పెళ్లి చేసుకున్నాడు? `నాకు కావల్సిన అల్లుడు సంతూనే` అని గోపాలంతోనే ఎలా చెప్పించగలిగాడు? అనేదే కథ.
మారుతి ఎప్పుడూ పెద్ద పెద్ద కథలు రాసుకోడు. చిన్న పాయింట్ పట్టుకుని కథలు అల్లేస్తాడు. తన బలం కామెడీ. దాన్ని నమ్ముకుని సినిమాలు సక్సెస్ ఫుల్ గా పరిగెట్టించేస్తాడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు చిత్రాల్లో మారుతి ఓ బలహీనతని పట్టుకుని కథ రాశాడు. ఇందులోనూ `భయం` అనేది ఓ బలహీనత. కాకపోతే… హీరో సైడు నుంచి కాదు. ఓ క్యారెక్టర్ వైపు నుంచి. నిజానికి ఇది సంతోష్ శోభన్ కథో, మెహరీన్ కథో కాదు. అచ్చంగా అజయ్ ఘోష్ కథ. ఆ కథలోకి మిగిలినవాళ్లంతా వచ్చారు. ఎప్పుడూ హీరో బలహీనతతో ఆడుకునే మారుతి.. ఈసారి సైడ్ క్యారెక్టర్ నే మెయిన్ క్యారెక్టర్ గా మార్చి, తనకో బలహీనతని ఆపాదించి, దానితో కథంతా నడిపేయాలని చూశాడు. అయితే ఈ పథకం పారలేదు.
నిజానికి కథ పునాదే బలంగా లేదు. పక్కింటి వాళ్లు `నీ కూతురు అలాంటిది… ఇలాంటిది` అని చెబితే.. కూతుర్నిఅంతగా ప్రేమించిన తండ్రి.. దాన్ని ఇలా రిసీవ్ చేసుకుంటాడా? ఇది భయం కాదు. నమ్మకం లేకపోవడం. మారుతి పునాది ఎంచుకోవడంలోనే తప్పు చేసేశాడు. `ఈపాటికి నీ కూతురికి అన్నీ అయిపోయి ఉంటుంది. అల్పాహారాలు లాగించేసి ఉంటాడు` అని ఓ పాత్రతో చెప్పిస్తే.. దాన్ని సదరు తండ్రి ఎమోషన్ గా ఫీలైతే.. దాన్ని కామెడీగా చూపించడం ఏమిటి? ఎప్పుడూ సదరు మూర్తి, కోటి అనే పాత్రలు గోపాలం చెవిలో జోరిగల్లా… `నీ కూతురు అలాంటిది ఇలాంటిది` అని పుల్లలు విరుస్తూ ఉంటారు. సినిమా అంతా ఇదే తంతు. కేవలం గోపాలానికి మనశ్శాంతి లేకుండా చేయడమే.. పక్కింటివాళ్ల లక్ష్యం. కానీ అది క్రమంగా గోపాలం ప్రాణాలు తీసేంత స్థాయికి వెళ్తుంది. ఆ విలనిజం ఇలాంటి కథలో అతకలేదు. పైగా కృతకంగా తయారైంది.
సింగిల్ లేయర్ కథలెప్పుడూ ప్రమాదమే. చెప్పదలచుకున్న పాయింట్ బలహీనంగా ఉంటే, కథ ముందే తేలిపోతుంది. ఈ సినిమాకీ అదే ఎదురైంది. ప్రతీ సీనూ… ఐదారునిమిషాల పాటు సుదీర్ఘంగా సాగుతుంటుంది. ఆసన్నివేశాలకు భారీ భారీ డైలాగులు రాసేశాడు మారుతి. దాంతో… డైలాగులెక్కువ, ఎమోషన్ తక్కువ అన్నట్టు తయారైంది సీన్. కరోనా అనే పాయింట్ ని చివర్లో తీసుకొచ్చారు. కరోనా భయాల్ని, అప్పటి పరిస్థితినీ మనం ఇప్పటికీ మర్చిపోలేం.అయినా… ఆయా సీన్లు.. పండలేదు.
అయితే వీటి మధ్య మారుతి మార్కు సీన్లు లేవా? అంటే ఉన్నాయి. అప్పడాల విజయలక్ష్మి..కాస్త వినోదం పంచుతుంది. ఫోన్ కాన్వర్జేషన్ లో సాగిన ఎపిసోడ్ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. అజయ్ ఘోష్ కి నిద్ర రాకపోతే… అమ్మ పక్కన చేరి హాయిగా పడుకుంటాడు. అక్కడ ఎమోషన్ ని మాటల్లో గానీ, తీతలో గానీ బాగా చూపించగలిగాడు మారుతి. ఇలాంటి మంచి సీన్లు అక్కడక్కడ పడ్డాయి. కానీ ఆ డోసు సరిపోలేదు. మారుతి ఇంట్రవెల్ బ్యాంగ్ ఎప్పుడూ కాస్త హిలేరియస్ గా పడుతుంటాయి. ఈసారి అది కూడా మిస్సయ్యింది. తొలి సన్నివేశాల్లో కాస్త డబుల్ మీనింగ్ డైలాగులు (టిఫిన్స్.. అల్పాహారాలు, నా హార్స్ పవర్ నీకు తెలీదా?) వినిపిస్తాయి.
సంతోష్ శోభన్ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. తన పక్కన హీరోయిన్, రెండు పాటలు ఉన్నాయి కాబట్టి.. తనని హీరోగా చెప్పుకోవాలి. కాకపోతే.. సినిమా మొత్తం అజయ్ ఘోష్ చుట్టూనే తిరుగుతుంది. ఓ రకంగా.. తనే హీరో. అజయ్ ఘోష్‌కి ఇంత లెంగ్త్ ఉన్న పాత్ర దక్కడం ఇదే తొలిసారి. ఓ తండ్రిగా, భయస్థుడిగా…బాగా నటించగలిగాడు. మెహరీన్ బాగా బక్కగా మారిపోయింది. తనతో పాటు తనలోని గ్లామర్ కూడా బాగా సన్నబడింది. వెన్నెల కిషోర్ ఓకే అనిపించాడు గానీ, మారుతి గత సినిమాలతో పోలిస్తే.. ఈ పాత్ర వీకే. హర్షని సైతం సరిగా వాడుకోలేదు. అప్పడాల విజయలక్ష్మి ఎపిసోడ్ లో ప్రవీణ్, సుదర్శన్ నవ్విస్తారు.
రెండు పాటలు, వాటి కొరియోగ్రఫీ ఆకట్టుకుంటాయి. విజువల్ గా సినిమా బాగుంది. చిన్న సినిమా అనే ఫీలింగ్ రాలేదు. మారుతి కథకుడిగా ఫెయిల్ అయ్యాడు. తన మ్యాజిక్ ఈసారి కనిపించలేదు. కొన్ని కొన్ని చోట్ల మారుతి కలం మెప్పిస్తుంది. చిన్న సినిమాలు తీయాలి… అన్న ఆలోచన మంచిదే. కాకపోతే.. దానికి
తగిన కాన్సెప్టుల్నిమారుతి ఎంచుకోవాలి. “తక్కువ బడ్జెట్ లో, మంచి అవుట్ పుట్ తో సినిమా తీశాడు మారుతి. లాక్డౌన్లో చాలా మందికి పని కల్పించాడు…” అదే.. ఈసినిమా ముఖ్య ఉద్దేశ్యం అయితే.. అది నెరవేరినట్టే. కానీ ప్రతీరోజూ పండగే లాంటి హిట్ సినిమా తీయాలనుకుంటే మాత్రం – ఆ టార్గెట్ కి మారుతి చాలా దూరంలో నిలబడిపోయినట్టే లెక్క.
ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలంటే భయం ఉండకూడదు అనే మంచి సందేశాన్ని తీసుకొని , దాన్ని సినిమా రూపం లో మలచడంలో విఫలమైన సినిమా ఇది
తెలుగు360 రేటింగ్ : 2.25/5