వన్స్ అపాన్ ఏ టైమ్.. ” ఒకప్పుడు ఓ అడవిలో సామ్రాజ్యాన్ని పులి పరిపాలిస్తూ ఉండేది. అయితే ఆ పులి ఆధిపత్యాన్ని ప్రశ్నించే జంతువులు కూడా కొన్ని అడవిలో ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాటిని పులి ఓడిస్తూ వస్తోంది. తనను ఓడించే వారు ఎవరూ లేరన్న ఓ ఆలోచన మదిలోకి వచ్చిన తర్వాత ఇక పులి ఎవర్నీ లెక్క చేయడం లేదు. ఎవ్వరినైనా ఓడించగలనన్న ధైర్యంతో దురహంకారముతో ప్రవర్తించండం ప్రారంభించారు. ఎవరైనా ఎదురు తిరిగినా తన బలంతో వేధించడం ప్రారంభించింది. ఈ విషయం గమనించిన కొంత మంది పులికి ఎలాగైనా బుద్ది చెప్పాలనుకున్నారు. ” ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు.. నీకు తగిన విరోధిని చూపిస్తాము వారితో పోటీపడాలని” నేరుగా పులికే సూచించారు. దానికి అంగీకరించిన పులి ఆ విరోధిని చూపించమన్నది. చివరికి వారు ఓ కొండను చూపిస్తారు. తనకు ఎదురే లేదనుకున్న పులి ఆ కొండను ఢికొట్టింది. మొదట్లో కొంత ఇసక కొండ మీంచి రాలింది. దీనితో మరింత రెచ్చిపొయిన పులి మరింత దూకుడుగా ఢీ కొట్టడం ప్రారభించింది. చివరికి ఏమయిందో.. ఏమవుతుందో మనందరికీ తెలుసు. వీర్రవీగిన పులి దారుణంగా ఓడిపోయి అందరి ముందు పరువు పోగొట్టుకుంది. పదవి కూడా పొగొట్టుకుంటుంది…” ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న ఓ నీతి కథకు ప్రేరణగా సృష్టించిన కథ. ఇందులో కూడా నీతి ఉంది. ప్రస్తుతం మన ఎదురుగా ఉన్న రాజకీయాలకు సరిగ్గా సరిపోయే నీతి ఉంది. ఇక్కడ అధికారంతో కళ్లు మూసుకుపోయిన తనకు ఎదురే లేదనుకుంటున్న పులిని మన రాజకీయ నాయకులతో పోలిస్తే… ఆ కొండను రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యంగా చెప్పుకోవచ్చు. అలవి మాలిన అధికారాన్ని అనుభవిస్తే ప్రజల్నే తక్కువగా అంచనా వేస్తే అంతిమంగా ఎదురయ్యేది పరాభవమే.
అధికార మత్తు తలకెక్కితే కాలమే గుణపాఠం నేర్పుతుంది !
ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా నిస్సందేహంగా హుజురాబాద్ ఉపఎన్నికల గురించే. ” కాలం అందరి దూల తీర్చేస్తుంది.. ఎవర్నీ వదిలి పెట్టదు.. సరైన సమయం రావాలంతే ” అని ఓ సినమాలో పూరీ జగన్నాథ్ డైలాగ్ రాస్తారు. నిజానికి కాలానికి మన దూల తీర్చే సమయం మనమే ఇస్తాం. మనం కన్నూ మిన్నూ కాన రాక చేసే తప్పుల ద్వారా ఆ చాన్స్ ఇస్తాం. అందుకే బుక్కయిపోతాం. ఇది మన లాంటి సామాన్యుల దగ్గర్నుంచి ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నాయకుల వరకూ జరుగుతుంది. తనకు ఎదురే లేదని.. ఎనిమిదేళ్లుగా అనధికారిక చక్రవర్తిగా తెలంగాణను పరిపాలిస్తున్న కేసీఆర్ .. ఆ అధికారం మాయలో పడి కాలానికి చాన్సిస్తున్నారు. దాని ఫలితమే ఇప్పుడు హుజురాబాద్ రూపంలో ఎదురొచ్చింది. ప్రజల్ని తక్కువగా అంచనా వేసి ముందు ముందు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన వాతావరణాన్ని స్వయంగా సృష్టించుకున్నారు.
ఈటల విషయంలోనూ సరిగ్గా అంచనాలు వేయనివ్వని అధికారమత్తు !
ఈటల రాజేందర్ అంత తప్పేం చేశారు ?. అప్పటి వరకూ మంత్రిగా ఉండి కోవిడ్ సమయంలో చురుకుగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌పై అనూహ్యంగా టీఆర్ఎస్ ఆస్థాన మీడియా, టీఆర్ఎస్ పెద్దల గుప్పిట్లోకి వెళ్లిన కొన్ని చానళ్లలో ఒకే రీతిన ఒకే సారి వచ్చిన కథనాల తర్వాత తెలంగాణ ప్రజల్లో వచ్చిన సందేహం అది. ఈ సందేహం ఈటల భూ కుంభకోణం చేశారా లేదా అన్నది కాదు.. కేసీఆర్‌తో ఎందుకు చెడింది..? ఎక్కడ చెడింది ? అనేదే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగే మిత్రులు కూడా ఉండరు. అలా అనుకుని ఈటల – కేసీఆర్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఉండవచ్చు. కానీ ఈటలను మరీ అంత దారుణంగా ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. అక్కడ్నుంచే ఈటల రాజేందర్‌పై సానుభూతి పెరిగింది. కానీ ఇక్కడే కేసీఆర్ అధికారం అనే మత్తులో ఉండిపోయారు. వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేయలేకపోయారు. అందుకే ఈటల రాజీనామా అనగానే అప్పటికప్పుడు ఆమోదింప చేసి..క్షణాల్లో గెజిట్ కూడా జారీ చేయించారు. అప్పుడు ప్రారంభమైన పతనం… హుజురాబాద్ ఓటమితో మధ్య స్థితికి చేరింది. ఇక క్లైమాక్స్ ఎక్కడ … ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.
ప్రజల్ని తక్కువ అంచనా వేసి వ్యూహాలు పన్నిన కేసీఆర్ !
ప్రజల్ని తక్కువగా అంచనా వేసి.. అధికార బలంతో ఏమైనా చేయవచ్చని పాలకులు అనుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజ అభిప్రాయాలను అధికార దండంతో సామ, భేద, దాన, దండోపాయాల్ని ఉపయోగించి మార్చేయవచ్చని అనుకోవడంతోనే సమస్య వచ్చింది. హుజూరాబాద్ ఫలితం జనాభిప్రాయానికి, పట్టపగ్గాలు లేని అరాచకానికి సైతం వెనుకాడని అధికార రాజకీయం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందేనని నిరూపించింది. బహుశా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రజల్లో తెలంగాణ ఉద్యమాన్నే ఇట్టే ఉప్పొంగేలా చేయడంలో సక్సెస్ అయ్యాను కాబట్టి.. హుజురాబాద్ చాలా చిన్న విషయం అనుకుని ఉంటారు. అయితే ఇక్కడే ఆయన దారి తప్పారు. ఉద్యమాన్ని నిర్మించినట్లుగా కాకుండా .. రాజకీయం అంటే ఓటర్లను డబ్బుతోను, మాయతోను ప్రలోభపెట్టమనే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందు కోసం వేల కోట్లను కుమ్మరించడం, పగబట్టినట్టు వేధించడం వంటివిచేశారు. ఎన్నిక ఫలితాన్ని ఆహ్వానించ గలిగితే కేసీఆర్‌కు అసలు విషయం అర్థం అవుతుంది. లేకపోతే ఇంకా ఆయన కళ్లను అధికార పొర వీడలేదని అనుకోవాల్సి ఉంటుంది.
హుజురాబాద్ శాంపిలే .. ప్రజల్ని తక్కువ చేస్తే ఎక్కడైనా..ఎప్పుడైనా షాకిస్తారు !
నిన్నామొన్న హుజురాబాద్ ఉపఎన్నిక జరిగింది కాబట్టి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. కేసీఆర్ అధికారం అనే మంత్రదండం మాయలో పడి తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు. కానీ ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు. అటు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇంకా దారుణంగాఉంది. అక్కడ ప్రజలు కేవలం ఓటర్లు మాత్రమే. ఇక ఏ విధంగానూ అక్కడ వారిని మనుషులుగా చూసే పరిస్థితి లేదు. కులం, మతం , ప్రాంతం పేరుతో పాలకులే రెచ్చగొట్టి పరిపాలన చేస్తున్నారు. కానీ ఎల్లప్పుడూ ప్రజలు అదే మాయలో ఉండలేరు. తెలంగాణలో కళ్ల ముందు అదే కనిపిస్తోంది. ప్రజలు రియలైజ్ అవుతారు. ఇప్పుడు తాము తీసుకుంటున్న నిర్ణయాలు అధికారం అనే కళ్లకు గంతలు కట్టి ఉన్నప్పుడు.. అంతా స్పష్టంగా కనబడుతోందన్న ఉద్దేశంతో తీసుకుంటున్నారు. కానీ కాస్త స్థిమితంగా ఆలోచిస్తే తాము ఎంత భయంకరమైన తప్పులు చేశామో వారికి అర్థమవుతుంది. కానీ భారత రాజకీయాల్లో.. రాజకీయ నేతల్లో ఉండే మైనస్ ఏమిటంటే.. పదవి ఉన్నంత కాలం వారి కళ్లకు అధికార మత్తు అడ్డు వస్తూనే ఉంటుంది. పదవులు పోయిన తర్వాత మాత్రమే తమ నిర్ణయాలు ప్రజలను మెప్పించలేదని.. వారిని కష్టపెట్టామని తెలుసుకుంటారు.
హుజురాబాద్ గుణపాఠం నుంచి అధికార నేతలు పాఠాలు నేర్చుకుంటారా ?
ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు.. బలం ఉందన్న లెక్క లేని తనంతో కేంద్ర ప్రభుత్వం సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు వ్యతిరేకించే చట్టాలను తీసుకొచ్చాయి. వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎంత ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రజలెవరూ పెద్దగా మద్దతు ప్రకటించడం లేదు కదా అని లైట్ తీసుకుంటున్నట్లుగా ఉంది. అలాగే పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా. కేంద్రం ప్రజల ఆదాయాల్ని పెంచే నిర్ణయాలను తీసుకోవడం మానేసి ప్రజల ఆదాయాల్ని పిండుకునే నిర్ణయాలు తీసుకుంటోంది. పేదలకు మరింత పేదలయి.. మధ్యతరగతి వాళ్లు కుటుంబాలను పోషించుకోవడానికే తంటాలు పడిపోవాల్సిన పరిస్థితి కల్పించారు. కేంద్రంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే కాదు.. అధికారం అనే మత్తులో తమ రాజకీయ ప్రయోజనాలు లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుని.. ప్రజలకు పప్పు బెల్లాలుపంచితే వాళ్లే ఓట్లేస్తారని భావిస్తున్న ప్రతి ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఓటర్లు తమదైన రోజున గుణపాఠం నేర్పుతారు. హుజురాబాద్ ఫలితం చెబుతోంది అదే.
చాన్సిచ్చిన ఓటరే వేటు వేస్తారని రాజకీయ నేతలు ఇప్పటికైనా గుర్తు చేసుకోవాలి !
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. వారు ఇచ్చిన అవకాశంతో అధికారంలోకి వచ్చి .. వారినే తక్కువ అంచనా వేయడం నిజంగా అధికారం మత్తు నెత్తికెక్కడమే. వారు చాన్స్ వచ్చినప్పుడు ఆ మత్తును దించేస్తారు. దానికి కొంత సమయం పడుతుంది. వారే అవకాశం ఇచ్చి ఉన్నారు కాబట్టి.. మళ్లీ తమకు అవకాశం వచ్చే వరకూ ఎదురు చూస్తారు. ఓ ఓటుతో చాన్సిచ్చారో అదే ఓటుతో వేటు వేస్తారు. అది అనాదిగా భారత ప్రజాస్వామ్యంలో కనిపిస్తున్న ట్రెండ్. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే… రాజ్యం ఏలుతున్న పాలకులు ఎప్పటికప్పుడు తమ అధికారం శాశ్వతమనే ఓ హలోకేషన్లోకి వెళ్లిపోతున్నారు కానీ వాస్తవాలను గుర్తించడం లేదు. అందుకే హుజురాబాద్ లాంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. పాలకులు ఈ గుణపాఠాన్ని నేర్చుకుని పాలనా తీరు మార్చుకుంటే ప్రజలు ఓటను సానుకూలంగా వాడతారు.. లేకపోతే వ్యతిరేకంగానే వాడతారు. అందులో సందేహం ఉండదు.
ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో చాన్సివ్వాలన్నా.. వేటు వేయాలన్నా.. ఓటు అనే వజ్రాయుధం ప్రజల వద్ద ఉంది.