టాలీవుడ్‌కి దీపావళి ఎప్పుడూ కలసి రాలేదు. దీపావళిన ఎన్ని సినిమాలు వచ్చినా – పెద్దగా ఆడింది లేదు. ఈసారీ అదే బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగింది. ఈ దీపావళికి 3 సినిమాలు థియేటర్ల ముందుకొచ్చాయి. మంచి రోజులొచ్చాయి, పెద్దన్న, ఎనిమీ – థియేటర్లలో కొలువు తీరాయి. మంచి రోజులొచ్చాయి కి ఒక రోజు ముందే ప్రీమియర్లు పడ్డాయి. ఓ చిన్న సినిమాకి ప్రీమియర్లు వేయడం సాధారణమైన విషయం కాదు.కంటెంట్ పై నమ్మకం ఉంటేనే వీలవుతుంది. అయితే.. మారుతి చేసిన ఈ ప్రయత్నం తుస్సుమంది. మారుతి మార్క్ కామెడీ మిస్సవ్వడం, కథ బేస్ సరిగా లేకపోవడం వల్ల `మంచి రోజులు` నిలబడలేకపోయింది.
రజనీకాంత్ `పెద్దన్న`గా పలకరించాడు. తనదీ సేమ్ కథ. పరమ రొటీన్ కథతో రజనీ విసిగించేశాడు. 80ల నాటి కథలే ఇంతకన్నా వెరైటీగా అనిపించేవి. రజనీ ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ని నమ్ముకుని తీసిన సినిమా ఇది. అయితే… రజనీ ఫ్యాన్స్ కూడా అప్డేటెడ్ అయిపోయారన్న విషయం దర్శకుడు మర్చిపోయాడు. విశాల్ చేసిన మరో భారీ సినిమా `ఎనిమి` కీ ఇదే రిజల్ట్ వచ్చింది. కేవలం యాక్షన్ సీన్స్‌పై ఆధార పడి తీసిన సినిమా ఇది. మిగిలిన కమర్షియల్ హంగులేవీ అతకలేదు. దానికి తోడు లాజిక్ లేని మైండ్ గేమ్ తో.. సాగింది సినిమా. పండగ రోజు కాబట్టి.. థియేటర్లు కళకళలాడుతూ కనిపించాయి. కొన్ని చోట్ల వసూళ్లు బాగున్నాయి. ఇంకొన్ని చోట్ల డల్ అయిపోయాయి. ఈ సినిమాలకు ఎంతొచ్చినా ఈ మూడు రోజులే. నిర్మాతల టార్గెట్ కూడా అదే.