చేతిలో ఓ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడు.. మరో సినిమా చేయడం దర్శకులకు అంత ఈజీ కాదు. హీరోలు, హీరోయిన్లు అయితే వెంటనే స్విచ్చాన్, స్విచ్చాఫ్ అయిపోతుంటారు. డైరెక్టర్లంతా ఒకే కథపై ఫోకస్ పెట్టాల్సివస్తుంటుంది. అందుకే దాసరి తరవాత ఒకేసారి రెండు మూడు సినిమాల్ని డీల్ చేసే దర్శకులు కనిపించలేదు. అయితే ఈమధ్య క్రిష్ ఆ ప్రయత్నం చేశారు. `హర హర వీరమల్లు`కి కాస్త గ్యాప్ రావడంతో.. వెంటనే ఆయన `కొండపొలం` సినిమాని మొదలెట్టారు. నిజానికి ఇది చాలా రిస్కీ మూవ్. చేతిలో ఓ అగ్ర కథానాయకుడి సినిమా ఉన్పప్పుడు, చిన్న సినిమా చేయడం అన్నిసార్లూ శ్రేయస్కరం కాదు. చేసిన చిన్న సినిమా తేడా కొడితే – ఆ ప్రభావం పెద్ద సినిమాపై పడుతుంది. కానీ క్రిష్ అదేం పట్టించుకోలేదు. `కొండపొలం` తీసేశాడు.
సరిగ్గా ఇదే ఎత్తుగడ మారుతి వేశాడు. గోపీచంద్ తో `పక్కా కమర్షియల్` కి బ్రేక్ రాగానే, ఆ టైమ్ వృధా చేయకూడదన్న ఉద్దేశంతో `మంచి రోజులు వచ్చాయి` తీశాడు. కేవలం 30 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. గ్యాప్ వచ్చినప్పుడు ఖాళీగా కూర్చోకుండా, తమకున్న వనరులలో సినిమాలు తీయడం అభినందించ దగిన విషయమే. దాని వల్ల… చాలామందికి పని దొరుకుతుంది. కాకపోతే.. అటు క్రిష్కీ, ఇటు మారుతికీ ఇద్దరికీ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొండపొలం ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయిదీ అదే పరిస్థితి. అదృష్టం ఏమిటంటే.. ఈ సినిమాలు తీసిన నిర్మాతలు ముందే టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవడం. కాకపోతే.. తమ కెరీర్లో అటు క్రిష్, ఇటు మారుతి… ఒక్కో ఫ్లాప్ వేసుకోవాల్సివచ్చింది. అదే బాధ.