చెరుకు పంట బకాయిలు చెల్లించలేదన్న ఆందోళనలపై ఉక్కుపాదం మోపాలనుకున్న పోలీసులను సొంత జిల్లా రైతులు తిరగబడి కొట్టడంలో తప్పు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. అదే సమయంలో వేల ఎకరాల భూములు రాజధానికి మోసపోయి .. రోడ్డున పడ్డ అమరావతి రైతుల్ని మాత్రం ఆయన రైతులుగా గుర్తించడానికి సిద్ధపడటంలేదు. వారు రైతులు కాదంటున్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రలో రైతులు లేరని టీడీపీ నేతలే పాదయాత్ర చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చేశారు. అమరావతి రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా మేలు చేస్తోందని కౌలు కూడా చెల్లించామని చెప్పారు. అయినా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని .. అంత అవసరం ఏముందని.. అందుకే అది టీడీపీ యాత్ర అంటున్నానని చెప్పుకొచ్చారు.
బొత్స సత్యనారాయణ అమరావతి రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొదటి నుంచి ముందు ఉన్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో తమ పార్టీ తరపున కుక్కను నిలబెట్టినా గెలుస్తామని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రైతులను గుర్తించడానికి కూడా ఆయన సిద్ధపడటం లేదు. అదే సమయంలో సొంత జిల్లాలో చెరుకు రైతులు ప్రైవేటు కంపెనీ బకాయిలు చెల్లించలేదని ఇటీవల ఆందోళన చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులపైనే దాడి చేశారు. కొబ్బరి మట్టలతో పోలీసులను తరిమికొట్టారు. ఈ ఘటనను బొత్స సత్యనారాయణ సమర్థించారు.
రైతులు తిరగబడటంలో తప్పులేదని.. వారి ఆవేదనను అర్థం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ భూములు అమ్మి అయినా సరే రైతుల బకాయిలు చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. రైతులు తొందరపడి మాట్లాడొద్దని.. రాళ్లతో పోలీసులపై దాడి చేసినా వాళ్లు సంయమనం పాటించారన్నారు. అయితే రైతులు తిరగబడటం వెనుక టీడీపీ నేతలున్నారని ఆరోపించారు. తన జిల్లాలో ప్రైవేటు కంపెనీ విషయంలో పోలీసుల తీరును రైతులు ఖండించి తిరగబడితే… సమర్థించిన బొత్స .. అదే వేల ఎకరాల భూమి ఇచ్చి అన్యాయమైపోయిన రైతులు పాదయాత్ర చేస్తూంటే మాత్రం వారిని దారుణంగా కించ పరుస్తున్నారు.