హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఘన విజయంతో ఈటల రాజేందర్ ఇమేజ్ అనూహ్యంగా మారిపోయింది. ఇప్పుడు బీజేపీలో ఆయన ఓ టాప్ లీడర్‌గా మారిపోయింది. ఆయన ఎక్కడకు వెళ్లినా భారీ క్రేజ్ వస్తూండటం.. ఈటల కూడా ఇతర ప్రాంతాల్లో బహిరంగసభలు పెడతానని ప్రకటించడంతో బీజేపీలోనూ అంతర్గతంగా భిన్నమైన చర్చ జరుగుతోంది. బీజేపీలో అందర్నీ అధిగమించేసి ఆయన పైకెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కొంత మంది నేతల్లో వస్తున్నాయి.
ఉపఎన్నికల్లో గెలిచినందున పార్టీ హైకమాండ్ ను కలిసి ఆశీస్సులు తీసుకునేందుకు ఈటల శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతో పాటు ముఖ్య నేతలూ వెళ్తున్నారు. అమిత్ షా , జేపీ నడ్డాతో పాటు కుదిరితే ప్రధాని మోడీతోనూ సమావేశం అవుతారు. పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఈటలను గుర్తించింది. పార్టీ జాతీయకార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితునిగా చాన్సిచ్చింది. దీంతో ఆయనపై పార్టీ హైకమాండ్‌కు కూడా పాజిటివ్ అభిప్రాయాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.దీంతో ఢిల్లీ పర్యటనలో ఆయనకు ఏమైనా అనూహ్యమైన హామీ లేకపోతే బాధ్యతలు ఇస్తారేమోన్న సందేహం తెలంగాణ ముఖ్య నేతలను పట్టి పీడిస్తోంది. ఒక్క సారిగా ఆయనను ఉన్నత స్థానానికి చేరిస్తే తమ పరిస్థితేమిటన్నది చాలామందికి అర్థం కావడం లేదు.
అయితే బీజేపీలో అలా ఉండదని.. ఎవరైనా కింది నుంచి ఎదగాల్సిందేనని అంటున్నారు. అయితే కేసీఆర్‌కు చెక్ పెట్టగలిగే అన్ని రకాల సామర్థ్యాలు ఈటలకు ఉన్నాయన్న ఓ అభిప్రాయం హైకమాండ్‌లో బలంగా ఉంటే.. ఆయనే తెలంగాణకు సంబంధించినంత వరకూ బీజేపీకి మొదటి వ్యక్తి అయ్యే అవకాశం ఉందని అదే జరిగితే … బీజేపీలో 70శాతం నేతలు అసంతృప్తికి గురయ్యే చాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది.