హుజురాబాద్ ఫలితం కాంగ్రెస్ పార్టీలో కొత్త సెగలు రాజేస్తోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న సీనియర్లకు ఈ ఫలితం ఎంతో సంతోషాన్నిచ్చింది. కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో అది పూర్తిగా రేవంత్ రెడ్డి ఖాతాలో వేసి.. ఆయనదంతా ఉత్తుత్తి రాజకీయం అని చెప్పేందుకు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. కొంత మంది ఇక్కడ్నుంచే నివేదికలు పంపుతున్నారు. ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, కారణాలను విశ్లేషిస్తూ నివేదిక పంపాలని హైకమాండ్ నుంచి ఆయా రాష్ట్రాల ఇంచార్జులకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు హుజురాబాద్ ఫలితాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది.
గత ఎన్నికల్లో అరవై వేల ఓట్లకుపైగా తెచ్చుకుని ఈ సారి మూడు వేల లోపు ఓట్లకు పరిమితం కావడం దారుణమైన వైఫల్యమే. అభ్యర్థి ఎంపిక దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ బీజేపీకి అనుకూలంగా పని చేశారని టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నేతలు కొంత మంది ఆరోపిస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ ఉపఎన్నిక బాధ్యతను నేరుగా తీసుకోలేదు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బాధ్యతలు ఇచ్చారు. ప్రచారానికి కూడా రేవంత్ రెడ్డి ఆలస్యంగా వెళ్లారు. ఈ పరిణామాలన్నింటినీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ పార్టీలోని సీనియర్లు ప్రయత్నిస్తున్నారు.
వారు తీసుకెళ్లకపోయినా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత జరిగిన మొదటి ఉపఎన్నికల్లో ఇంత దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రావడం హైకమాండ్‌ను సైతం నివ్వెర పరిచేదే. ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డికి మాస్ లీడర్‌గా మంచి గుర్తింపు ఉంది. అందుకే వీలైనంత వరకూ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కాస్త పలుకుబడి తగ్గుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే రేవంత్ రెడ్డికి మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమవుతాయి.