హుజురాబాద్ ఉపఎన్నికల కోసం కేసీఆర్ అమలు చేసిన వ్యూహాల్లో “బకరా”గా మిగిలిపోయిన నేత కౌశిక్ రెడ్డి అంటూ రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఉండదని ఇక గుర్తింపు కూడా కష్టమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే అలా చేయడం వల్ల టీఆర్ఎస్ అధినేత విశ్వసనీయతకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఉపఎన్నికలు మధ్యలో ఉన్నప్పుడే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కోసం న్యాయపోరాటం చేస్తామన్న సంకేతాలను బయటకు పంపారు. అలాంటిదేమీ చేయలేదు.
ఇప్పుడు హుజురాబాద్ ఫలితం తేడా వచ్చింది . దీంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి త్రిశంకు స్వర్గంలో పడింది. ఇప్పుడు ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది.ఆ ఆరు స్థానాల కోసం కనీసం అరవై మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే కేసీఆర్ అనూహ్యంగా పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపాలని నిర్ణయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేయాలన్న కేబినెట్ ప్రతిపాదనను ఉపసంహరించుకుని ఆయనను ఎమ్మెల్యే కోటాలో పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయనకు బదులుగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపాలనుకున్న నేతను నామినేట్ చేస్తారని భావిస్తున్నారు.
ఈ నెల పదహారో తేదీ లోపు ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేయాల్సి ఉంది. అప్పుడు మాత్రమే క్లారిటీ వస్తుంది. అప్పటి వరకూ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అని ప్రచారం జరిగితే.. ఆయన పార్టీలో చేరినప్పటి నుండి పెడుతున్న గిలిగింతలు లాంటివే తప్ప.. నిజం కాదు. అందుకే ఈ సారి నామినేట్ అయినట్లుగా అధికారిక సమాచారం కోసం కౌశిక్ రెడ్డి ఎదురు చూస్తున్నారు.