రజనీకాంత్ `పెద్దన్న` ఇటీవలే… ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలాకాలం తరవాత రజనీ తనస్టైల్ లో చేసిన మాస్ ఎంటర్టైనర్ ఇది. అందుకే అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ రజనీమాత్రం రొడ్డకొట్టుడు సెంటిమెంట్ కథతో నిరాశ పరిచాడు. ఇలాంటి సెంటిమెంట్ కథలు ఇది వరకు చాలానే వచ్చాయి. ఈ సినిమా తీసిన శివనే… `వేదాళం`లో సిస్టర్ సెంటిమెంట్ గుప్పించాడు. సరిగ్గా అదే కథని అటూ ఇటూ మాచ్చి `పెద్దన్న`లా తీశాడు. అది కాస్త పల్టీ కొట్టింది.
ఈ సినిమా ప్రభావం ఇప్పుడు `భోళా శంకర్ పై పడబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. `వేదాళం`కి రీమేక్ ఈ సినిమా. పెద్దన్న, భోళా శంకర్… రెండూ దాదాపుగా ఒకేలా అనిపిస్తాయి. పైగా రెండు చోట్లా హీరో చెల్లాయి పాత్రలో కీర్తి సురేషే కనిపిస్తుంది. ఆ రూపంలో కూడా ప్రేక్షకులకు చూసిన సినిమానే, మళ్లీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలిగే ప్రమాదం ఉంది. పెద్దన్నని ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. మరి… భోళా శంకర్ పరిస్థితి ఏమిటి? పైగా ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు కూడా బాలేదు. తనకి ఈ సినిమా ఛాన్స్ దొరకడమే పెద్ద ఆశ్చర్యం. వేదాళం కథలో భారీ మార్పులు చేస్తే తప్ప… భోళా శంకర్ వర్కవుట్ కాదు. మరి మెహర్ ఏం చేశాడో?