ఓ వైపు వరదలతో లక్షలాది మంది అల్లాడుతూంటే ఏపీ ప్రభుత్వం… మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుఅంశాల్లో ఏం చేయాలో తల బాదుకుంటోంది. హైకోర్టు ఆ బిల్లులను కొట్టి వేస్తుందని న్యాయనిపుణులు తేల్చేయడంతో ఇప్పుడు ఆ నిర్ణయాలను ఎలాగైనా లైవ్లో ఉంచాలన్న వ్యూహంతో అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నట్లుగా హైకోర్టుకు తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఆ తర్వాత మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిర్ణయం ప్రకటించారు. మంత్రులు ఆమోదించారు.
ఈ విషయాన్ని హైకోర్టులో మూడు రాధానులపై విచారణ జరుగుతున్న సందర్భంలో ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ వివరించారు. మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై హైకోర్టులో రోజువారి విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. నిజానికి బిల్లులు ఎప్పుడో పాసైపోయాయి. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఆ సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆచరణ ఆగిపోయింది. ఇప్పుడు వాటి చట్టబద్ధతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రెండు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడం రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణం అవుతోంది.
మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్లుగా కాదని.. మరో రూపంలో తెర మందుకు తెస్తారని భావిస్తున్నారు. కోర్టుల్లో ఆ బిల్లులు నిలబడవన్న కారణంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏ రూపంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో సీఎం జగన్ చేయనున్న ప్రకటన ఆధారంగా ప్రభుత్వ వ్యూహం ఏమిటో తెలిసే అవకాశం ఉంది.