మూడు రాజధానుల బిల్లులపై ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నప్పటికీ త్వరలో అన్ని వర్గాల ఆమోదంతో కొత్త బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం జగన్ ప్రకటించారు. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లుల ఉపసంహరణపై జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. తాము రాష్ట్ర అభివృద్ది కోసం పాలనా వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంటే అనేక రకాలుగా అపోహాలు, న్యాయపరమైన చిక్కులు సృష్టించారని ఆరోపించారు. అమరావతిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.., కానీ ఇక్కడ ఎకరాకు రూ. రెండు కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైనేజీ లాంటివి కల్పించాల్సి ఉంటుందన్నారు. అంటే యాభై వేల ఎకరాలకు రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని అంత సొమ్ము ఎక్కడిదని ప్రశ్నించారు. అదే విశాఖలో అయితే రోడ్లు, డ్రైనేజీ ఉన్నాయని… కొద్దిగా ఖర్చు పెడితే హైదరాబాద్ తో పోటీపడే నగరం అవుతుందన్నారు.
మూడురాజధానుల నిర్ణయానికి అడ్డు పడకపోతే ఇప్పటికే ఫలితాలు వచ్చేవని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తమ అభిప్రాయాలు మారలేదని న్యాయపరమైన చిక్కులు ఉండటంతో వెనక్కి తీసుకుంటున్నట్లుగా తెలిపారు. అంతకు ముందు ఉపసంహరణ బిల్లులను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. భాగస్వాములతో సంప్రదింపులు జరపకపోవడం, శాసనమండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లడం వంటి కారణాల వల్ల బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా బుగ్గన చెప్పారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వం వ్యూహాత్మకంగా బిల్లులను ఉపసంహరించుకున్నట్లుగా కనిపిస్తోంది. శాసనమండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయి.
ఆ తర్వాత కొత్త బిల్లులు తీసుకు వచ్చారు. ఈ బిల్లులను మాత్రం ఉపసంహరించుకున్నారు. పాత బిల్లుల సంగతేమిటన్నదానిపై స్పష్టత లేదు. పైగా మళ్లీ బిల్లులు తెస్తామన్నారు. ఈ సారి శాసనమండలిలో కూడా ఆమోదం పొందితే ఇక కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేసినట్లుగా చెబుతున్నారు. మూడు రాజధానుల కాన్సెప్ట్‌తోనే ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్లే ఆలోచన కూడా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఐదేళ్ల పాలనపై కన్నా.. మూడు రాజధానుల అంశంపైనే ప్రజాతీర్పు కోరితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా బిల్లులు వెనక్కి తీసుకోవడానికి మరో కారణంగా భావిస్తున్నారు.