ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడానికి ఆయన సతీమణిని దారుణంగా అవమానించిన ఘటనపై దేశవ్యాప్తంగా ప్రతి స్పందనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తెలంగాణ నుంచి కూడా పలువురు నేతలు తమ అభిప్రాయాలు చెప్పారు. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ సహా అనేక మంది వైసీపీ నేతల తీరును తప్పు పట్టారు. మహిళల్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ కొండా సురేఖ కూడా స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరి కావన్నారు.
ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ ఎందుకు స్పందించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడానికి ఓ కారణం ఉంది. కొద్ది రోజుల కిందట టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం అన్న ఓ ఉత్తరాది ఊతపదాన్ని పట్టుకుని .. సీఎం జగన్ తననే అన్నారని తెలుగులో కొత్త అర్థం చెప్పుకున్నారు. అలా చెప్పుకుని చేసిన దాడులను కేటీఆర్ సమర్థించారు. ఓ ముఖ్యమంత్రిని అలా తిట్టడం ఏమిటన్నారు. దానికి సాక్షి మీడియా భారీగా ప్రచారం కల్పించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానంపై.. మహిళల్ని కించ పరిచిన వైనంపై ఎందుకు స్పందించరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రశ్నలో రీజన్ ఉంది.
అలాగే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎందుకు స్పందించని కొండా సురేఖ ప్రశ్నించారు. స్వయంగా తన అన్న నేతృత్వం వహిస్తున్న పార్టీ.. తాను ఓటు వేయాలని ప్రచారం చేసిన ఎమ్మెల్యేలు ఓ మహిళను ఘోరంగా అవమానిస్తే ఎందుకు మాట్లాడరని షర్మిల ప్రశ్నించారు. ఆమె స్పందించాలని సురేఖ డిమాండ్ చేస్తున్నారు. మరి సురేఖ డిమాండ్లు… షర్మిల, కవిత, కేటీఆర్ వరకూ వెళ్తాయో లేదో..!