న్యాయస్థానాలపై దూషణల కేసులో పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని హైకోర్టు గడువు పెట్టినా సీబీఐ ఇంకా ఆ విషయంలో ముందడుగు వేసినట్లుగా లేదు. ఈ మేరకు సీబీఐకి విచారణ పురోగతిపై సీల్డ్ కవర్లో ఓ నివేదిక సమర్పించి.. ఆ వివరాలు బయటకు వస్తే తదుపరి దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని ధర్మాసనానికి వివరించింది. ఆ రిపోర్టులో ఏముందో కానీ ఇప్పుడు కేసును సీబీఐ సీరియస్‌గా తీసుకుదన్న వాదన మాత్రం వినిపిస్తోంది.
సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఓ మాఫియా మాదిరిగా తప్పుడు ప్రచారం చేసి వ్యవస్థను బెదిరించాలనుకున్న ఓ కుట్రను సీబీఐ వెలికి తీయడానికి అవసరమైన సరంజామా మొత్తం దొరికినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ అంశంలో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. న్యాయమూర్తులపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిలో పలువురు పలుకుబడి ఉన్న వారు ఉన్నారు. వారికి సంబధించిన వ్యాఖ్యలు… ఇతర అంశాలను కూడా సీబీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
హైకోర్టులో వచ్చే విచారణ తర్వాత ధర్మాసనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న దానిపై సీబీఐ తదుపరి అడుగులు పడే అవకాశం ఉంది. పంచ్ ప్రభాకర్ ను స్వదేశానికి రప్పించి అరెస్ట్ చేసేందుకు బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ విషయంలో సక్సెస్ అయితే.. చాలా వరకూ గుట్టు ముట్లు వీడిపోతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన వైసీపీ సోషల్ మీడియా ముఖ్యులకు ఇంత వరకూ బెయిల్ లభించలేదు.