తెలంగాణ రాజకీయాల్లోనే ఉండాలని కల్వకుంట్ల కవిత తేల్చుకున్నారు. కుటుంబం నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఒత్తిడి వచ్చినా ఆమె అంగీకరించలేదు. దీంతో చివరికి ఆమె సిట్టింగ్ సీటు.. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును ఆమెకే కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసినా నిజామాబాద్ అంశం మాత్రం పెండింగ్‌లో ఉంది. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కుటుంబసభ్యులతో చర్చించి చివరికి కవితను ఎమ్మెల్సీగానే పోటీ చేయించాలని నిర్ణయించారు.
నిజామాబాద్‌లో ఓటమి తర్వాత పార్టీలో క్రియాశీలకంగా కనిపించలేదు. దీంతో అనేక రకాల ప్రచారం జరిగింది. దాదాపు రెండేళ్లు కవిత సైలెంట్ గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలను పట్టించుకోలేదు. తర్వాత నిజామాబాద్స్థానిక మండలి ఎన్నికల్లో కవితను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. భారీ మెజార్టీతో కవిత గెలిచారు. అప్పటికే కవితకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే ప్రచారం ప్రగతిభవన్ నుంచే సాగింది. కానీ మంత్రి పదవి మాత్రం కవితకు దక్కలేదు.
కేటీఆర్‌ను సీఎం చేస్తారనే ప్రచారం నేపధ్యంలో కవితను ఢిల్లీకి పంపాలని అనుకున్నారు. దీనికి అనుగుణంగానే రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్‌ను మండలిలోకి తీసుకున్నారు. కవిత కోసమే ఆ స్థానాన్ని ఖాళీ చేయించారని పార్టీ వర్గాల్లోనూ ప్రచారం జరిగింది. కానీ, కవిత మాత్రం కేంద్రానికి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదంటున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా తండ్రిపై అలిగారనే చర్చ కూడా సాగింది. ప్లీనరీకి కూడా వెళ్లలేదు. కేటీఆర్, కవిత మధ్య పొసగడం లేదని ఇప్పుడు ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే టీఆర్ఎస్లో కుటుంబ సమస్యలు పెరిగిపోతాయన్న ఆందోళన క్యాడర్లోఉంది. కానీ కేసీఆర్ కూడా వీటిని పరిష్కరించలేకపోతున్నారు.