కేసీఆర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. సోమవారం కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరితోనూ భేటీ కాలేదు. ఎవరి అపాయింట్మెంట్లు లభించలేదు. కానీ ఆయనతో పాటు వచ్చిన అధికారులు మాత్రం ఆహారశాఖ అధికారులతో బియ్యం సేకరణపై చర్చ జరిపారు. అయితే కేసీఆర్ కేవలం బియ్యం విషయంలో తేల్చుకుంటామని చెప్పి వచ్చారు కానీ అసలు అంశం రాజకీయమేనని ఢిల్లీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆయన కలవాలనుకున్న కేంద్రమంత్రులు అందుబాటులో ఉండరని తెలిసి కూడా కేసీఆర్ ఢిల్లీకి వచ్చారని అంటున్నారు. పైగా ఆయన ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టత లేదు.
అదే సమయంలో జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు ఆయన వెళ్లినట్లుగా తెలుస్తోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఆమె కూడా కుదిరితే ప్రధానమంత్రితో సమావేశం అవుతానని బయలుదేరేముందు ప్రకటించారు. మమతా బెనర్జీ, కేసీఆర్ ఢిల్లీలో ఉండటంతో ఓ కూటమి ప్రయత్నాలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే రోజునే ఓ పెళ్లిలో సీఎం జగన్తో చర్చించారు. ఈ కారణంగా జాతీయ రాజకీయాల విషయంలో గుంభనంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్రాన్ని మించి ఎదిగిపోయానని.. ఢిల్లీలోనే తన తదుపరి కార్యాచరణ ఉండాలని ఆయన అనుకుంటున్నారు. ఈ దిశగా మరోసారి చేస్తున్న ప్రయత్నాలే తాజా ఢిల్లీటూర్ అంటున్నారు. మొత్తానిగి ఢిల్లీలో పరిణామాలు శర వేగంగా మారుతున్నాయన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.