“కొత్త డాక్టర్ కన్నా.. పాత రోగి నయం..” అని ఓ సామెత ఉంటుంది. నేరాల్లో ఆరితేలిపోయి ఎలా బయటపడాలో తెలిసిపోయిన వారు… పేరు మోసిన లాయర్ల కంటే తెలివిగలవాళ్లు. తమ క్రిమినల్ బ్రెయిన్‌కు ఆ తెలివి తేటల్ని జోడిస్తే సులువుగా కోర్టుల్ని మోసం చేయగలుగుతారు. ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన అడుగులు చూస్తూంటే ఖచ్చితంగా కళ్ల ముందు ఇదే కనిపిస్తుంది.
చట్టాలు కొట్టి వేస్తే ఇక కష్టమనే తెగింపు !
మూడు రాజధానుల బిల్లుల్ని సీఎం జగన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరికి కావాల్సిన వాదన వారు వినిపిస్తున్నారు. ఎవరికి నచ్చిన మాటలు వారు చెబుతున్నారు. కానీ కళ్ల ముందు కనిపిస్తున్న కారణం మాత్రం ఒక్కటే. అదే కోర్టుల్ని మోసం చేయడం. మూడు రాజధానులు న్యాయపరంగా నిలబడవని క్లారిటీ వచ్చేసింది. చట్టాల్ని న్యాయస్థానాలు కొట్టి వేస్తాయి. కొట్టి వేస్తే ఆ అంశానికి అంతటితో తెరపడుతుంది. మరోసారి ఏం చేసినా తీర్పునకు విరుద్దం అవుతుంది. రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అందుకే వేగంగా బిల్లుల ఉపసంహరణ నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే బిల్లుల ఉపసంహరణ నిర్ణయాన్ని ముందుగా కోర్టుకు తెలిపి.., ఆ తర్వాత అసెంబ్లీలోప్రవేశ పెట్టారు.
న్యాయాన్ని కూడా మోసం చేయవచ్చునని నిరూపించిన రాజకీయం !
చట్టాలను వెనక్కి తీసుకోవడం వల్ల హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణను ముగించే అవకాశం ఉంది. బిల్లులు ఆమోదించిన విషయాన్ని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తారు. చట్టబద్దంగా బిల్లులను ఉపసంహరించినందున…, హైకోర్టు కూడా ఈ అంశంలో ప్రత్యేకంగా విచారణ జరిపేదేమీ ఉండకపోవచ్చని న్యాయనిపుణుల అంచనా. ఉపసంహరించినందున బిల్లుల కొట్టివేత అనేమాటే రాదు. అలా రాదు కాబట్టే సీఎం జగన్ మళ్లీ బిల్లులు పెడతామని నిర్మోహమాటంగా చెప్పారు. ఇది సాలిడ్‌గా కోర్టుల్ని మోసం చేయడం కాక మరేమిటి ?
ఎన్నికల్లో ప్రాంతీయ విబేధాలే అస్త్రాలు !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు మూడు రాజధానులనే ముడి సరుకుగా వాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదేళ్ల పరిపాలన కన్నా.., మూడు రాజధానుల అంశం ఎజెండాగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి ఆ పార్టీ వ్యూహకర్తలు రావడం వల్లనే బిల్లులు వెనక్కి అనే నిర్ణయం వచ్చిందని భావిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బిల్లులను ప్రవేశపెడతారు. ఆ తర్వాత రైతులు కోర్టులకు వెళ్తారు. ఆ వివాదం ఎన్నికల వరకూ సాగుతుంది. అప్పుడు ఇదే అంశంపై ఎన్నికలకు వెళ్తారు. ఐదేళ్ల పాలన అంశం ఓటింగ్ ఎజెండా కాకుండా పోతుంది. ఇక జగన్‌కు అంత కంటే కావాల్సిందేముంది ?