ప్రభుత్వ ఆర్థిక కష్టాల దెబ్బకు పన్నుల రూపంలో ప్రజల్ని బాదేయడమే కాకుండా… పంచాయతీల దగ్గర ఉండే రూపాయి.. ఆర్థరూపాయిని కూడా మిగల్చకుండా లాగేసుకుంది. దీంతో సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. పదిహేనో ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు నిధులను ప్రభుత్వాలకు ఇవ్వదు. నేరుగా పంచాయతీల ఖాతాలోనే వేస్తుంది. ఇలా ఈ ఏడాది కోటాను జమ చేసింది. అలా నిధులు జమ కాగానే.. చాలా మంది సర్పంచ్‌లు .. పంచాయతీల్లో చేయించిన మోటార్ల రిపేర్లు.. ఇతర చిన్న చిన్న పనుల బిల్లులను చెల్లించాలని ఆశపడ్డారు.
అయితే హఠాత్తుగా ఖాతాలు ఖాళీ అయిపోయాయి. దీంతో సర్పంచ్ల గుండెల్లో పిడుగులు పడినట్లయింది. ఏం చేయాలో తెలియక పై అధికారుల్ని సంప్రదిస్తే అవును.. తీసుకున్నామని చెబుతున్నారే కానీ మళ్లీ ఇస్తారో లేదో చెప్పడం లేదు. దీంతో వారికి ఇప్పుడు తమకు పేరుకుపోయిన బిల్లులకు ఎలా చెల్లించాలా అని మథనపడుతున్నారు. వైసీపీ సర్పంచ్‌లే ఎక్కువ. వారు కూడా ఖర్చు పెట్టుకునే ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఏం చేయాలా అని మథన పడుతున్నారు. ఏం చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు.
కడప జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో పదిహేను మంది వైసీపీ సర్పంచ్‌లు ధైర్యం చేసి రాజీనామాలు చేసేశారు. చిల్లుగవ్వ లేని.. రాని.. ఏపనులు చేయని.. చేయలేని సర్పంచ్ పదవులు ఎందుకని వారు లేఖ రాసేశారు. దీంతో ఇతర సర్పంచ్లకూ ధైర్యం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ నిధులపై ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.