సొంతజిల్లాను వరదలు అతలాకుతలం చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. రెండు, మూడు తేదీల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరులోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షలు చేయనున్నారు. అసెంబ్లీలో తనపై వస్తున్న విమర్శలకు స్పందించి.. తాను అక్కడికి వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని… ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడైనా వరద బాధిత ప్రాంతాలకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఇప్పుడు వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముగిసిపోయాయేమో కానీ ఆయన పర్యటించాలని నిర్ణయంచుకున్నారు.
సీఎం జగన్ పర్యటనకు ముందుగానే .. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో పార్టీ నేతలకు వివరించారు. కొన్ని చోట్ల ఆయనకు నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి పర్యటనలో అలాంటివేమీ ఉండకూడదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయ కార్యక్రమాలు గొప్పగా చేపట్టాలన్న అభినందనలు బాధితలు చెప్పేలా ఉండాలని ఆయన తమ పార్టీ వర్గాలకు.. అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే బాధితులు అందరికీ పరిహారం కాకుండా కొంత మందికే .. ఓ పార్టీ వారికే ఇచ్చారు. దీంతో పలు గ్రామాల్లో నిరసనలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇతర పార్టీల వారిని హౌస్ అరెస్టులు చేసే అవకాశం ఉంది. అయితే … ఇప్పటి వరకూ అరకొరగా.. రూ. వెయ్యి.. రెండు వేలు మాత్రమే పరిహారం ఇచ్చిన అధికార యంత్రాగం..సీఎం జగన్ సమీక్ష తర్వాత భారీగా పరిహారం పెంచుతారని.. బాధితులు ఆశ పడుతున్నారు. ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులు.. ఎకరానికి కనీసం రూ. ఇరవై వేలు సాయం చేయాలని కోరుతున్నారు. వీరి బాధలపై జగన్ స్పందించి నష్టపరిహారం పెంచింతే.. కొంత మేర వారు సంతృప్తి పడే అవకాశం ఉంది.