సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన సీఎం జగన్ అని దేశవ్యాప్తంగా గొప్పగా ప్రకటించారు. డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. జగన్ ఎంత గొప్పవాడోనని అందుకే వీక్లీ ఆఫ్ ఇచ్చారని చాలా సార్లు చెప్పారు. తీరా చూస్తే పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు కావడం లేదు. ఆ విషయాన్ని పోలీసుల అమర వీరుల దినోత్సవం రోజున సీఎం జగనే చెప్పారు. కరోనా కారణంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయలేకపోయామని.. ఇప్పటి నుండి అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
పోనీలే చెప్పిన రెండున్నరేళ్లకయినా అమలవుతోంది కదా అని పోలీసులు సంతృప్తి పడ్డారు. కానీ అదంతా ఉత్తదే. ఇప్పటికీ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు కావడం లేదు. ఈ విషయాన్ని హోంమంత్రి సుచరితనే నేరుగా చెప్పారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను త్వరలోనే అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలంటే తగినంత సిబ్బంది ఉండాలి. ఇటీవలి కాలంలో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో సమస్య జఠిలం అయింది. ఈ కారణంగా వీక్లీ ఆఫ్ అసాధ్యమని.. పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ చెప్పారు కాబట్టి.. ప్రభుత్వానికి ఆ పేరుతో పబ్లిసిటీ చేసుకుంటూంటే మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు.
మాకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వలేదు కదా అని పోలీసులు ఎదురు తిరిగే పరిస్థితి లేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు.. టీడీపీ నేతలపై మాత్రం రోడ్లపై పరుగెత్తించి కొడతాం అని మహిళా పోలీసులతో స్టేట్మెంట్లు మాత్రం ఇప్పిస్తూంటారు. ఇలాంటివి చూసినప్పుడే ఏపీ ప్రజలు కూడా పాపం పోలీసులు అనుకోకుండా ఉండలేరు. కానీ ఒక్క సారి వంగడం ప్రారంభమయిన తర్వాత పతనం చివరి దాకా సాగుతుంది. అప్పుడు ప్రజలు కూడా సానుభూతి చూపించరు. ఆ పరిస్థితి ఏపీ పోలీసులకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.