రాయలసీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయిపోయాయని… తక్షణం రూ. వెయ్యికోట్ల సాయం చేయాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఆ తర్వాత రాజ్యసభలో విజయసాయిరెడ్డి కూడా అడిగారు. సీఎం జగన్ రాసిన లేఖకు స్పందన లేదు కానీ.. పార్లమెంట్లో ఎంపీ అడిగారు కాబట్టి వెంటనే సమాధానం బయటకు వచ్చింది. అదేమిటంటే వరదలు రాక ముందే రూ. 895కోట్లు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిందట. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
భారీ వర్షాలు, వరదల వలన సంభవించిన పంట, ఆస్తి నష్టానికి సంబంధించి 895 కోట్ల రూపాయలను రాష్ట్ర విపత్తుల నిధి ( ఎస్డిఆర్ఎఫ్ ) కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా ముందస్తుగానే విడుదల చేశామని స్పష్టంచేశారు. విపత్తులు సంభవించినపుడు బాధితులకు తక్షణ సాయం, పునరావాసం కల్పించేందుకు ఎస్డీఆర్ఎఫ్ నుంచి నిధులను వినియోగించేందుకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 1,192.80 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం వాటా 895.20 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 297.60 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా 895.20 కోట్లను రెండు విడతలుగా ఇచ్చేశామని మంత్రి తెలిపారు.
విపత్తుల నిర్వహణ బాధ్య ప్రాధమికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. విపత్తులు సంభవించినపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ నుంచి నిధులను వినియోగించి సహాయ చర్యలు చేపట్టవలసి ఉంటుందన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేవలం సహాయ చర్యలకు మాత్రమే వినియోగించాలి తప్ప నష్టపరిహారం చెల్లించడానికి కాదని స్పష్టం చేశారు. అంటే ఇక కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందదరని పరోక్షంగా కేంద్రం చెప్పినట్లయింది.