సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన సినిమా పాటలతో ప్రసిద్ధి పొందారు. సినిమా సహజంగానే గ్లామర్ ఫీల్డ్.. ఆయన పాటలు అన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి కాబట్టి స్ఫూర్తి పొందిన వారు.. ప్రేరణ పొందిన వారు .. ఇలా అందరూ తమ తమ స్పందనలు వ్యక్తం చేశారు. బాగుంది. అనూహ్యంగా ఆయన కుటుంబం ఏదో ఆర్థిక కష్టాల్లో ఉందన్నట్లుగా ప్రభుత్వాలు ఎగబడి ఆస్పత్రి బిల్లులు తామే కడతాం.. కట్టిన అడ్వాన్సులు కూడా వెనక్కి ఇచ్చేయమని చెప్పినట్లుగా ప్రకటించుకున్నాయి. ఈ అంశంపై చాలా మంది బయటకు స్పందించకపోవచ్చు. అందరికీ ఓ డౌట్ అయితే వచ్చింది. వాళ్లను ఎవరు అడిగారు..? ఆర్థిక సాయం చేయమని సిరివెన్నెల కుటుంబం అడిగిందా? మరి ఎందుకు ఇచ్చారు..?
అడగకపోయినా కొందరికి లక్షలకు లక్షల సాయం ఎందుకు !?
సిరివెన్నెల కంటే ఒక్క రోజు ముందే శివశంకర్ అనే నృత్యదర్శకుడు చనిపోయారు. ఆయన కూడా సిరివెన్నెల స్థాయిలోనే ప్రసిద్ధి. కాకపోతే సరివెన్నెలది పాట.. ఆయనది ఆట. ఆయనకు కూడా అందరూ నివాళులర్పించారు. కానీ కనీసం ఒక్క ప్రభుత్వం కూడా అధికారికంగా సంతాపం చెప్పలేదు. పైగా శివశంకర్ కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఈ విషయం తెలిసి సినిమా ప్రముఖులు స్పందించారు కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇంకా చెప్పాలంటే సిరివెన్నెల కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు. కానీ ఆ కుటుంబానికి సాయం కోసం ప్రభుత్వాలు పోటీ పడ్డాయి. ఎందు కోసం ?
సీఎంఆర్ఎఫ్ సాయం కోసం లక్షల్లో ఉన్న దరఖాస్తులు పట్టవా ?
కొన్నాళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం కత్తి మహేష్ అనే సెలబ్రిటీకి కూడా ఇలానే ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. రోడ్ ప్రమాదంలో ఆయన గాయపడితే.. అపోలో ఆస్పత్రికి చికిత్స ఎంతైనా పర్వాలేదని ఆఫర్ ఇచ్చేసింది. అది వైసీపీ నాయకుల సొంత సొమ్ము కాదు. ప్రజాధనమే. అయినా ఇచ్చేసింది. ఎందుకలా ? . అనేక మంది సెలబ్రిటీలు చనిపోతూంటారు. వారిలో అందరికీ సాయం అందదు. కొంత మందికే సాయంఅందిస్తూంటారు. ఎందుకలా చేస్తూంటారు ? సెలబ్రిటీల సంగతి పక్కన పెడితే సామాన్య ప్రజలను అసలు పట్టించుకోరు. సీఎంఆర్ఎఫ్ కింద ఓ సామాన్యుడు ఆస్పత్రి బిల్లు పొందాలంటే ఏళ్ల తరబడి కాళ్లు అరిగేలా తిరగాలి. కానీ ప్రయోజనం ఉంటుందో ఉండదో చెప్పలేము. కానీ సెలబ్రిటీలు.. ప్రభుత్వంలో ఉండి రాజకీయం చేస్తున్న వారికి అవసరమైన వారికి మాత్రం రూ. లక్షలకులక్షలు పుట్టుకొస్తాయి. ఎందుకీ వివక్ష..?
రెండు ప్రభుత్వాలపైనా సామాన్యులపై వివక్ష విమర్శలు !
కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి యాభై మంది చనిపోతే.. బాధ్యత వహించాల్సిన తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి మృతుల కుటుంబాలకు ఆర్థికస్థోమత లేక ఫ్రీజర్ కూడాలేక ఐస్ గడ్డల్లో మృతదేహాలు ఉంచుకున్న దయనీయ దృశ్యాలు కనిపించాయి. ఇప్పటికీ వారికి పరిహారం అందలేదు. అదే ఏపీలో ప్రకృతి వైపరీత్యాలుజరిగి ప్రజలు రోడ్డున పడితే.. రూ. రెండు వేలు ఇచ్చి సరి పెట్టారు. ఇక అక్కడ సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు పెట్టుకుని కొన్ని వేల మంది ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి సంగతేమిటో ఎవరూ చెప్పలేరు.
ప్రజలిచ్చిన అధికారం అనుభవిస్తున్న అధికార నేతలే ఆలోచించాలి !
సీతారామశాస్త్రికి… కత్తి మహేష్‌కు ప్రభుత్వం సాయం చేసిందాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ కొంత మందికే ఇలా సాయం చేయడాన్నే ప్రశ్నిస్తారు. మిగతా వాళ్లు ఏం తప్పు చేశారు..? సామాన్యులు సాయం అందుకోలేనంత లెక్కలేని వాళ్లా ? ప్రభుత్వాలే ఆలోచించాల్సి ఉంది.