ఓ మాస్ సినిమా వస్తే.. థియేటర్ల దగ్గర పూనకాలు ఎలా ఉంటాయో? టికెట్ల కోసం కొట్లాట ఏ రేంజులో ఉంటుందో.. చూసి చాలా రోజులైంది. ఆఖండతో ఆ లోటు తీరుతుందన్నది ఇండ్రస్ట్రీ నమ్మకం. దాన్ని నిజం చేసింది అఖండ. ఈరోజు విడుదలైన అఖండ – అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. హైదరాబాద్లో తెల్లవారు ఝామున 4 గంటల నుండే బెనిఫిట్ షోల హడావుడి మొదలైపోయింది. అందరి నోటా ఒకటే మాట. `ఇది మాస్ జాతర` అని. ఈ రోజుంతా.. ఇదే ఊపు కనిపించబోతోంది. ఇప్పటికే తొలి రోజు అన్ని ఆటలూ బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. రేపు కూడా ఇదే జోరు ఉంటే.. సినిమా లైన్ లో పడిపోయినట్టే. నిజానికి ఇలాంటి హడావుడి కోసం టాలీవుడ్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది. సెకండ్ వేవ్ తరవాత.. బాక్సాఫీసు దగ్గర మాస్ బొమ్మ పడలేదు. పడితే జనం వస్తారా? హోస్ ఫుల్ బోర్డులు, బెనిఫిట్ షోల హడావుడి కనిపిస్తుందా? అనే మీమాంశ ఉండేది. అవన్నీ `అఖండ`తో పటాపంచలైనట్టే. ఈ వీకెండ్ లో అఖండ ఎంత ఎక్కువ వసూలు చేస్తే.. రాబోయే సినిమాలకు అంత ఊపిరి అందినట్టు అవుతుంది. ఎందుకంటే.. ఈ నెలలో పుష్ఫ వచ్చేస్తోంది. పుష్ఫకి ఇంతకు మించిన హడావుడి కనిపించబోతోంది. ఆ తరవాత వరుస కట్టే శ్యామ్ సింగరాయ్ కూడా మాస్ సినిమానే కాబట్టి.. బాక్సాఫీసుకు ఇలాంటి ఊపు కావాలి. అఖండ దాన్ని అందించడంలో విజయవంతమైంది.