భారత్‌లో కరోనా ధర్డ్ వేవ్ ప్రారంభమయింది. బెంగళూరులో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ రెండు కేసులు నమోదయినట్లుగా కేంద్రం ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చిన వారికి ఈ రకం వైరస్ సోకినట్లుగా గుర్తిచారు. హైదరాబాద్‌లోనూ ఒకరికి ఇలాంటి అనుమానంతో వారి శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఫలితాలు రావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి ఒమిక్రాన్ అంశంపై ఆందోళన నెలకొంది.
యూరోప్ దేశాలు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిపోయే విమానాలపై ఆంక్షలుకూడా విధించారు. ఇండియాలోనూ ఈ అంశంపై ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమని.. వ్యాక్సిన్ కూడా లొంగడం లేదన్న ప్రచారం జరుగుతూండటంతో ప్రజల్లో మరింత ఆందోళన కలుగుతోంది. ఈ క్రమంలో ఇండియాలో వైరస్ బయటపడటంతో ఏం జాగ్రత్తలు తీసుకుంటారన్నదానిపై ఆసక్తి ప్రారంభమైంది. కేసులు పెరిగితే లాక్ డౌన్ తరహా ఆంక్షలు మళ్లీ తప్పకపోవచ్చన్న అభిప్రాయం ఏర్పడింది.
తెలంగాణలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే ఆదేశించారు. మాస్క్ పెట్టుకోకపోతే.. రూ. వెయ్యి జరిమానా నిబంధన అమల్లోకి తెచ్చారు. విదేశాల నుంచి వచ్చే విమానాల రాకపోకలను ఆపేయాలని కొద్ది రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు.