చింతలపూడి, పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులకే కాదు పోలవరం ప్రాజెక్టుకూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసింది. పోలవరం ప్రాజెక్టుకు రూ. 120 కోట్లు.. ఇతర మూడు ప్రాజెక్టులకు రూ. 123 కోట్లు ఫైన్ వేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం కట్టాల్సిన జరిమానా రూ. 243 కోట్లకు చేరిపోయింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడం.. అనుమతులు లేకుడా నిర్మించడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టులను నిర్మించడమే కాదు.. వాటిని తాము అన్ని అనుమతులతో నిర్మించుకుంటున్నామని ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించడంలో విఫలమయింది.
పోలవరం ప్రాజెక్టుకు అన్నిఅనుమతులు వచ్చేసినట్లేనని విభజన చట్టంలో పేర్కొన్నారు. అది పార్లమెంట్ చట్టంప్రకారం జాతీయ హోదా పొందిన ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ విషయంలోనూ ప్రభుత్వం సమర్థవవంతమైన వాదన వినిపించలేకపోయింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయి .. రైతులకు నీళ్లు అందిస్తున్న చింతలపూడి, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలోనూఅదే దారి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పురుషోత్తమ పట్నం ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వ హయాంలో ముందుకు సాగలేదు. ఆ ప్రాజెక్టు పైనా సరైన వాదన వినిపించడంలో ప్రభుత్వం ఫెయిలయింది. చివరికి జరిగిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం జరిమానా కట్టే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. తదుపరి న్యాయపోరాటానికి ఏమైనా అవకాశం ఉంటే ఆ మేరకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కానీ.. జరిమానా కట్టే అవకాశాలు లేవు.అయితే జరిమానా సంగతి పక్కన పెట్టి కనీసం.. ప్రాజెక్టులైనా ముందుకు కదిలేలా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం బాధ్యతలు మరిచినట్లే అవుతుంది.