గత ఎన్నికలకు ముందు హడావుడిగా విశాఖలైర్వే జోన్‌ను ప్రకటించిన కేంద్రం తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇప్పుడు అసలు జోన్ చేసే ఉద్దేశం లేదని పార్లమెంట్లో ప్రకటించేసింది. అసలుదేశంలో ఇక కొత్త రైల్వే జోన్లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రస్తుతం 17 రైల్వేజోన్లు ఉన్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని అశ్వనీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు.. మరిన్ని జోన్లను ప్రకటించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
విశాఖను రైల్వే డివిజన్‌గా మూడేళ్ల కిందంట ప్రకటించిన కేంద్రం.. అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్‌ను మాత్రం రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్లో కలిపారు. మరో ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే… విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుందికానీ, డివిజన్ ఉండదు. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ ప్రకటించామంటూ… వాల్తేర్ డివిజన్‌ను ఒరిస్సాలోని రాయగడ డివిజన్లో కలిపేశారు. విశాఖ రైల్వే జోన్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు కానీ వాల్తేర్‌ను లాగేసుకుని రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి.
రాయగడ డివిజన్ ఏర్పాటుకు మౌలిక వసతులేమీ లేవు. అయినా అటు రైల్వేబోర్డు, ఇటు తూర్పుకోస్తా రైల్వేజోన్ రాయగడలో ఏర్పాట్ల మీద కోట్లకు కోట్లు ఖర్చు చేస్తోంది. డివిజన్ కేంద్ర కార్యాలయానికి భూకేటాయింపులు అయిపోయాయి. మరో వైపు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయి. డీపీఆర్‌లో ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌ను ఏర్పాటుచేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. తీసుకోవాల్సింది అధికారిక నిర్ణయమేనని చెబుతున్నారు. కానీ అడిగేవారు లేరని.. అందరూ భయంతో నోరు మూసుకున్నారని.. ఇక దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు.