అడ్డగోలుగా నిర్ణయం తీసుకోవడం.. ప్రచారం చేసుకోవడం.. తీరిగ్గా కోర్టులో నిలబడదని జీవో వెనక్కి తీసుకోవడం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. నిన్నామొన్నటి వరకూ కోర్టులు కొట్టి వేశాయి. ఇప్పుడు ఉపసంహరించకునేందుకు సిద్ధపడుతోంది ప్రభుత్వం. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాలలో నియమించిన గ్రామ కార్యదర్శులు మహిళా పోలీసులు అంటూ జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకుంటామని హైకోర్టుకు తెలిపింది.
గత జూన్‌లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను “మహిళా పోలీసులు”గా వ్యవహరించాలని జీవో నెం.59ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. వారు పోలీస్ శాఖలో అంతర్భాగమని ప్రకటిస్తూ వారికి “కానిస్టేబుల్” హోదా కల్పించింది. డీజీపీ గౌతం సవాంగ్ డ్రెస్‌లు డిజైన్ చేసి తీసుకెళ్లి సీఎంకు చూపించి .. గొప్పగా పొగిడారు కూడా. కానీ పోలీసు శాఖలో అలా అడ్డదిడ్డంగా నియామకాలు చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పలేకపోయారు. పోలీసు నియామకాలంటే ఓ పద్దతి ఉంటుంది. ఇలా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని పోలీసులుగా చేయాలంటే రాజ్యాగం విరుద్ధం. అది డీజీపీ సవాంగ్‌కు కానీ.. ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ కార్యదర్శి కుమార్ బిశ్వజిత్ కు అయినా తెలియకుండా ఉండదు. కానీ జారీ చేశారు.
దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని..పోలీస్ శాఖలో నియామకాలు పోలీసు నియామక బోర్డు ద్వారా జరగాలి. పోలీసుల విధులు నిర్వర్తించే హోం గార్డులను సైతం పోలీసులుగా పరిగణించరు. దీంతో హైకోర్టు ఎలా పోలీసులుగా నియమిస్తున్నారో చెప్పాలని నోటీసులు ఇచ్చింది చివరికి చెప్పలేక జీవో ఉపసంహరించుకుంటామని తెలిపింది. కొసమెరుపేమిటంటే..పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఈ మహిళా పోలీసుల్నే 15 మందిని నియమించామని వారికి శిక్షణ ఇవ్వడానికి భర్తీ చేయడం లేదని గౌతం సవాంగ్ సమర్థించుకున్నారు. ఇప్పడు ఆయన సమాధానం చెప్పడమూ ఇబ్బందికరమే.!