మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఎలా చర్చ లేకుండా తీసుకు వచ్చిందో.. అంతే చర్చ లేకుండా వెనక్కి తీసుకుంది. కానీ ఆమోదించడానికి… వెనక్కి తీసుకోవడానికి మధ్య ఆషామాషీ ఘటనలు జరగలేదు. అంతకు మించిన మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే రైతుల విప్లవం అని చెప్పుకోవచ్చు. ఆ విప్లవం గురువారం నాటికి విజయ తీరానికి చేరింది. రైతులు పెట్టిన డిమాండ్లన్నింటికీ అంగీకరించిన కేంద్రం.. అందరూ ఇళ్లకు వెళ్లాలని బతిమాలింది. చివరికి రైతులు డిమాండ్లన్నీ నేరవేర్చుకుని.. యుద్ధంలో గెలిచి ఇంటిబాట పట్టారు. దీన్ని బట్టి తెలిసిందేమిటంటే.. ైతులకు పొలం దున్నడమే కాదు… కావాలంటే హలం పట్టి ప్రభుత్వాలనూ దున్నగలరని నిరూపించారు.
రైతులు అడిగిన ప్రతీ డిమాండ్‌నూ అంగీకరించిన కేంద్రం !
ఢిల్లీ శివార్లలో ఏడాదికిపైగా ఉద్యమం చేస్తున్న రైతులు శాంతించారు. ఉద్యమాన్ని నడిపిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ప్రతిపాదిత సవరణలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. లిఖితపూర్వక హామీ ఇచ్చింది. రైతు ఉద్యమం సమయంలో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమా చల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను రైతు ఉద్యమం ముగించిన తరువాత ఉపసంహరించుకుం టామని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. వెంటనే కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.అలాగే రైతులకు పరిహారానికి సంబంధించి.. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయని కేంద్రం ప్రతిపాదించింది. పంటలకు కనీస మద్దతు ధర పై చట్టపరమైన హామీ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామనీ రైతు సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు ఉంటారని ప్రభుత్వ ప్రతిపాదించింది. రైతులు కూడా ఇదే డిమండ్ చేస్తున్నారు. దాన్ని కేంద్రం పరిష్కరించింది. అన్నీ సమస్యలు పరిష్కరించి..ఇక ఉద్యమం ఆపేసి ఇంటికెళ్లాలని రైతుల్ని కేంద్రం బతిమాలింది. చివరికి రైతులు అంగీకరించారు.
నియంత ప్రభుత్వంపై చిన్న పాటి విప్లమే చేసిన రైతులు !
రైతుల పోరాటంలో 700మందికి పైగా రైతులు అమరులయ్యారు. లక్షల సంఖ్యలో రైతులు, కార్మికులు, వారితో పాటు వారి కుటుంబ సభ్యుల తీవ్ర నిర్భంధాల మధ్య పోరాటం చేశారు. 2020జూన్‌లో ప్రారంభమైన రైతుల పోరాటం, ఆర్డినెన్స్‌లు తీసుకు వచ్చిన వెంటనే 2020 నవంబరు 26న కేంద్ర కార్మిక సంఘాలు సాధారణ సమ్మెకు పిలుపునివ్వడంతో గుణాత్మక మార్పును సంతరించుకుంది. 26-27 తేదీలలో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్కో ఆర్డినేషన్ కమిటీ నవంబర్ ఢిల్లీఛలో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీకి వెళ్తున్న రైతాంగంపై బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించడమేకాక, జాతీయ రహదారులపై కందకాలు తవ్వడం, బ్యారికేడ్స్కు బదులుగా ముళ్ళ కంచెలు అమర్చటం, వాటర్ కానాన్స్, టియర్ గాస్, లాఠీచార్జి లాంటి అమానుషమైన పద్ధతులను అనుసరించింది. అయినా రైతాంగం ఈ అవరోధాలన్నిటినీ అధిగమిస్తూ 12 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో, తమ నిరసనను తెలియజేస్తున్నారు. రైతులను టెర్రరిస్టులుగా చిత్రీకరించారు. పాకిస్థాన్, చైనా ఆదేశాలతో నడుస్తుందనే ప్రచారాన్ని చేశారు. అయితే రైతుల్ని ఇవేమీ భయపెట్టలేకపోయాయి. ఉద్యమ శిభిరాలకు ఇంటర్నెట్ను, విద్యుత్తును, నీటిసరఫరాలను నిలిపివేయడం.. గూండాలు దాడులు చేయటం, వెల్లువెత్తే సంఘీభావాన్ని నిలువరించడానికి ముళ్ళకంచెలతో కాంక్రీట్ గోడలను నిర్మించటం, కంచెలు ఏర్పాటు చేయడం, ఇనుప మేకులను నాటడం లాంటి చర్యలతో రైతులను అడ్డుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు.
ఆందోళన జీవులు.. పరాన్న భుక్కులుగా హేళన చేసిన మోడీ.. చివరికి వారికే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి..!
ప్రధానమంత్రి మోడీ ఓ సందర్భంలో నిరసన తెలిపే రైతాంగాన్ని ”ఆందోళన జీవులుగా” ”పరాన్నభుక్కులు”గా వర్ణిస్తూ అపహాస్యం చేశాడు. ఈ పోరాటాన్ని తక్కువ చేసి చూపుతూ, దేశ వ్యతిరేకమైనదిగా చిత్రించారు. దానికి తగ్గట్లుగానే ఉద్యమంపై దాడులు జరిగాయి. ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం ఈ ఉద్యమం కేవలం పంజాబ్ వరకే పరిమితమైనదని పేర్కొన్నప్పటికీ అంతర్గతంగా దేశం మొత్తం వ్యాపించింది. అందుకే మోడీ తన సహజశైలికి భిన్నంగా క్షమాపణ చెప్పి సాగు చట్టాలను ఉపసంహరించుకున్నారు. భారత్‌బంద్ లాంటి ఐక్య నిరసనలు నిర్వహించారు. ఈమధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంయుక్త కిసాన్ మోర్చా ”రైతు వ్యతిరేక బీజేపీకి ఓటు వేయరాదనే” నిర్ణయం తీసుకున్నది. కార్పొరేట్ దోపిడీని అనుమతిస్తూ, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వానికి, రాజకీయ ఓటమి కూడా ముఖ్యమైనదని భావించి ఇలాంటి నిర్ణయానికి వచ్చింది. చివరికి వరుస పరాజయాలు.. ముందున్న అతి పెద్ద యూపీ, పంజాబ్ ఎన్నికల సవాల్లతో బీజేపీ దిగి రాక తప్పలేదు.
సారీ చెప్పేస్తే రైతులన్నీ మర్చిపోతారా !?
కేంద్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా చట్టాలు వెక్కి తీసుకోలేదన్నది స్పష్టం. ఎందుకంటే రాబోయే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఓటు దెబ్బ రుచి చూపిస్తారని తేలిన తర్వాతనే వాటిని వెనక్కి తీసుకున్నారు. అదే తమదైనశైలిలో దేశ భక్తి సెంటిమెంట్‌ను రగిలించి ఉండగలిగినట్లయితే.. దాన్నే టాపిక్‌గా చేసుకుని రైతులఅంశాన్ని పక్కన పెట్టేసేవారు.కానీ అలాంటి పరిస్థితి లేకపోవడంతో వెనక్కి తగ్గారు. అంత వరకూ బాగానే ఉన్నా.. రైతులు నిజంగానే శాంతిస్తారా..? బీజేపీకి మళ్లీ ఓటేస్తారా అన్నది మాత్రం సందేహమే. ఎందుకంటే దెబ్బతిన్న పులి శ్వాస భయంకరంగా ఉంటుందన్నట్లుగా.. రైతులు గత ఏడాది కాలంగా పడిన ఇబ్బందులకు బదులు తీర్చుకోవాలనే పట్టుదలతోనే ఉన్నారు. అందుకే బీజేపీకి వ్రతం చెడినా ఫలితం దక్కదనేది ఎక్కువ మంది చెబుతున్నమాట. మరోసారి రైతుల జోలికి ఎవరూ రాకుడా వారు తమ సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఆందోళన విరమించి ఢిల్లీకి వెళ్లిపోయినా వారి పోరాటం మాత్రం ఆగే అవకాశం లేదు.
రైతుల జోలికి రావాలంటే ప్రభుత్వాలు భయపడాలి !
దేశం పారిశ్రామికంగా అనుకున్నతంగా అభివృద్ధి సాధించలేదు. ఇప్పటికీ వ్యవసాయ దేశమే. ప్రజల్లో అత్యధికులు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. కానీ ఆ వ్యవసాయాన్ని దెబ్బతీయాలని..ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యవసాయ రంగం మంచి కోసం తాము ఎన్నో పనులు చేస్తున్నామంటూ చెబుతూ ఉంటాయి. కానీ మంచి పనుల వల్ల రైతులకు ఏమి ఒనగూరుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ రైతులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టేసి.. ప్రభుత్వం.. తమ బాధ్యతల నుంచి వైదొలిగే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలు ఆ కోణం లోనివే. ప్రభుత్వాలు ఉన్నది వ్యాపారం చేయడానికో.. చేయించడానికో కాదు.. ప్రజల సంక్షేమం కోసం. వ్యాపారుల సంక్షేమం కోసం కాదు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోతున్నా… రైతుకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికి పండించిన పంటకు రైతులు మద్దతు ధర కోసం వెతుక్కోవాల్సిన పరిస్తితి.రైతును పైకి ఎదగకుండా చేసింది ఈ ప్రభుత్వమే… ఆ పేరుతో కార్పొరేట్ల చేతుల్లోకి పెట్టాలనుకున్నదీ ఈ ప్రభుత్వాలే. భరించి..భరించి రైతులు కూడా తిరగబడ్డారు. ఫలితంగా ప్రభుత్వం కూడా భయపడింది.
రైతులను అవమానించే ఏ ప్రభుత్వానికైనా చరిత్ర పాఠం చెబుతుంది !
ఒక్క కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు… అనేక రాష్ట్రాల్లో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఉన్నాయి. కుల, మత ప్రాంతాల ఆధారంగా రైతులను చీల్చి.. రాజకీయ కక్షలు తీర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పరయత్నాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు పేరుతో జరుగుతున్న రాజకీయం ఎంత మంది రైతుల ప్రాణాల మీదకు తెస్తుందో అంచనా వేయడం కష్టమేం కాదు. ధాన్యం అమ్ముకోలేక వరి కుప్పల మీద రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. భవిష్యత్ రాజధాని కోసం భూములిచ్చిన ఏపీ రైతులు… ప్రభుత్వం మారగానే రోడ్డున పడ్డారు. వారిపై విరగని లాఠీ లేదు.. ప్రయోగించని బూతుపదం లేదు. అత్యంత దారుణమైన.. అవమానకరమైన పరిస్థితుల్ని రైతులు ఎదుర్కొంటున్నారు.
అటు ఢిల్లీ రైతులైనా.. ఇటు తెలంగాణ రైతులైనా.. ఏపీ రైతులైనా… ప్రభుత్వాలకు తాము చెప్పాల్సిన గుణపాఠాన్ని ఖచ్చితంగా నేర్పుతారు. దానికి తగ్గ సమయం.. సందర్భం రావాలంతే.