ఏపీ ప్రభుత్వం 34 శాతం ఫిట్మెంట్ను ఉద్యోగులకు ప్రకటించబోతోందని విశ్వసనీయ సమాచారం పేరుతో కొంత మంది ప్రభుత్వంలోని వారు ఉద్యోగులకు లీక్ చేశారు. దీంతో ఉద్యోగుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికి 27 శాతం ఐఆర్ అమల్లో ఉంది. 34 శాతం అంటే.. మరో ఏడు శాతం జీతం పెరుగుతుంది. అటు వైపు తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు ఇచ్చింది 30 శాతం పీఆర్సీ మాత్రమే. ఎలా చూసినా కాస్త మెరుగైన పీఆర్సీనే . అయితే ఈ ప్రకటన సోమవారం ఉంటుందన్న లీక్ మాత్రం వచ్చింది.
మామూలుగా అయితే పీఆర్సీ నివేదికను బయటపెడతారు. అందులో ఉన్న సిఫార్సుల గురించి ఉద్యోగులతో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ప్రభుత్వం తన వెసులుబాటుకు అనుగుణంగా ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలి.. ఎప్పటి నుంచి వర్తింప చేయాలనేది నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పీఆర్సీ నివేదికను బయట పెట్టకుండానే ఫిట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఆర్థిక శాఖ అధికారులు ఈ అంశంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఎంత మేర ప్రభుత్వం భారం పడుతుదో నివేదిక సమర్పించారు.
కానీ ఆర్థిక పరిస్థితి కారణంగాఇప్పుడు పీఆర్సీ ఒక్క శాతం కూడా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయఉద్యోగులు ప్రొబేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యూలరైజేషన్ వెనుకబడిపోయింది. ఇలాంటివి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యల మధ్య ప్రభుత్వం నలిగిపోతోంది. అందుకే సోమవారం ప్రభుత్వం వైపు నుంచి వచ్చినవి లీకులేనా లేకపోతే నిజమా అన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.