నందమూరి తారక రామారావు ఫ్యామిలీలో చాలా కాలంగా మాటలు లేని దగ్గుబాటి, నారా కుటుంబాలు ఓ వేడుకలో కలిసి కనిపించారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కూతురు వివాహనిశ్చితార్థ వేడుక హైదరాబాద్లో జరిగింది.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం అంతా హాజరైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బీజేపీ నేత పురందేశ్వరి కూడా కుటుంబాలతో సహా హాజరయ్యారు. రాజకీయాలను పక్కన బెట్టి అందరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
తెలుగు రాజకీయాల్లో నారా , దగ్గుబాటి మధ్య ఉన్న శత్రుత్వం గురంచి కొత్త తరానికి తెలియదేమో కానీ.. కొంచెం పాత తరానికి బాగా తెలుసు. ఎన్టీఆర్ను దించేసిన ఎపిసోడ్లో చంద్రబాబు తర్వాత దగ్గుబాటిదే కీలక పాత్ర. అయితే తర్వాత ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతో దూరమయ్యారు. అప్పట్నుంచి చంద్రబాబు పేరు ప్రస్తావించడం కూడా వారికి ఇష్టం ఉండదు. అదే సమయంలో కుటుంబపరమైన ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ రెండుకుటుంబాలు ఒకే వేదికపై కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం రెండు కుటుంబాలు ఒకే వేదికపై కనిపించడమే కాదు.. పక్క పక్కనే నిలుచుని ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ .. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం దగ్గుబాటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ కలయిక కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందా అన్న చర్చ కూడా ప్రారంభమయింది.