భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయనతో పాటు చనిపోయిన 13 మందిలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ సాయితేజ కూడా ఉన్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుండి ఆయన కుటంబానికి పెద్ద ఎత్తున సానుభూతి చూపిస్తూ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం వైపు నుంచి పెద్దలెవరూ స్పందించినట్లుగా లేరు. కనీసం ఆర్థిక సాయం గురించి కూడా ప్రకటించలేదు. ఇప్పటి వరకూ ఎవరైనా జవాన్లు మరణిస్తే ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటిస్తూ వస్తోంది.
గుంటూరు జిల్లాకు చెందిన జశ్వంత్ రెడ్డి , చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారి పల్లెకు చెందిన హవాల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇలా మరికొందరికి యాభై లక్షల సాయం ఇచ్చింది. అలాగే చత్తీస్ ఘడ్ నక్సల్స్ కాల్పుల్లో చనిపోయిన జవాన్ రౌత్ జగదీష్ కుటుంబానికి రూ. 30లక్షలు వంటి సాయాన్ని గతంలో ఏపీ ప్రభుత్వం చేసింది. అందుకే సాయితేజ కుటుంబానికీ భారీ సాయం చేస్తారని భావిస్తున్నారు. కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రభుత్వం స్పందించదేమోనని ప్రతిపక్ష నేత చంద్రబాబు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.