ఏపీ స్కిల్ డెలవప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి అంటూ ఏపీసీఐడీ అధికారులు పెట్టిన కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఎవరెవరు ఎంతెంత లంచాలు తీసుకున్నారో చెప్పాలి. ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయో వివరించాలి.కానీ ఏపీ సీఐడీ అధికారులు అవినీతి జరిగిందని చెప్పరు.. దుర్వినియోగం పేరుతో కావాల్సిన వారిపై ఎఫ్ఐఆర్ పెట్టి.. కేసులు నమోదు చేసి.. సోదాల పేరుతో వేధించి వారిని అరెస్ట్ చేస్తారు. తర్వాత కోర్టు చూసుకుంటుంది. కానీ వారు అనుభవించాల్సిన శిక్ష అనుభవిస్తారు. ఇప్పుడు కూడా అంతే “స్కిల్ స్కాం” పేరుతో హడావుడి చేస్తున్న సీఐడీ ఎక్కడైనా అవినీతి లావాదేవీ జరిగిందో చెప్పడం లేదు. కానీ నిధుల దుర్వినియోగం అని చెబుతోంది. అది ఎలాంటి దుర్వినియోగమో చెప్పడం లేదు.
అయితే ఈకేసులో కేసులు పెట్టిన వారెవరు.. అసలు నిధుల విడుదలలో వారి పాత్రేమిటి అని ఆరా తీసినా సీఐడీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తారు. ఈ సంస్థకు అన్నీ తానై వ్యవహరించేది ఎండీ. డైరక్టర్ల బోర్డు ఉంటుంది. వారి పాత్ర పరిమితం. కేవలం బోర్డు సమావేశం జరిగినప్పుడు హాజరవడం .. స్కిల్ సెంటర్లు ఎక్కడెక్కడ పెట్టాలన్నదానిపై సలహాలిచ్చేలా బోర్డు సభ్యుడిగా ఉన్న లక్ష్మినారాయణను ఏ-2గా పెట్టారు సీఐడీ అధికారులు. అర్థరాత్రి పూట ఇంటిపై దాడి చేసి అరెస్టులు చేయడానికి కూడా సిద్ధపడ్డారు.
సీఐడీ ఎఫ్ఐఆర్లో నిధులు మంజూరు చేసిన ఎండీ పేరు లేదు. రెండు కీలక కమిటీల చేతుల మీదుగా ఈవ్యవహారాలు నడిచాయి.ఆ కమిటీలకు సారధ్యం వహించిన ఐఏఎస్‌ల పేర్లూ లేవు. కానీ ఓ వర్గానికి సంబంధించి టార్గెటెడ్‌గా కొంత మంది పేర్లు చేర్చి అరెస్టుల పేరుతో రాజకీయ కక్ష సాధింపులు ప్రారంభించారని టీడీపీ నతేలు ఆరోపిస్తున్నారు. పైగా ఆ ప్రాజెక్టులో ఉన్న కంపెనీలన్నింటినీ నిందితులుగా చేర్చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ కంపెనీల సేవలు అందుకున్నారు.
అవినీతి జరిగిందని విచారించాలనుకుంటే… డైరక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణకు ఏం సంబంధం అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నా రు. ఆయన ఏ చెల్లింపులకైనా సంతకం పెట్టారా..? ఒక్కడే ఏ నిర్ణయం అయినా తీసుకున్నారా..? బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున టీడీపీ హయాంలో 40కిపైగా నైపుణ్య అభివృద్ది కేంద్రాలు సిమెన్స్ నేతృత్వంలో ఏర్పాటు చేశారని.. దానికి ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి చెల్లింపులు చేశారని టీడీపీ వాదిస్తోంది. అదే సమయలో రెండు కమిటీలు ఈ మొత్తాన్ని పర్యవేక్షించాయని.. ఆ కమిటీలకు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, రావత్‌లు నేతృత్వం వహించారని వారి సిఫార్సుల మేరకే అన్నీ జరిగాయని వారినెందుకు ప్రశ్నించలేదని..అరెస్టు చేయలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది.