సీఎం జగన్ బొమ్మను చేతిపై పచ్చబొట్టు వేయించుకున్న టీటీడీ కార్మికురాలు రాధను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్ సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇచ్చి చేయకపోగా అరెస్ట్ చేయడంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరద ప్రాంతాల పరిశీలనకు సీఎం జగన్ తిరుపతికి వెళ్లినప్పుడు రాధ అని ఆమెను పిలిపించుకుని జగన్ మాట్లాడారు. ఎందుకంటే ఆమె జగన్ బొమ్మను చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. తన అభిమానాన్ని మీడియా ముందు చెప్పుకుంది.
అందుకే ఆమె తల మీద చేయి పెట్టి 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. అయితే 24 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోగా వారంలో ఆమెను.. మిగతా కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆమె సీఎం జగన్ను శాపనార్థాలు పెట్టారు. చెల్లెమ్మా అంటూ గొంతు కోశారని కన్నీరు పెట్టుకున్నారు. 2018 సంవత్సరంలో ప్రతిపక్ష నేత హోదాలో తిరుపతికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి టీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికులను తాము అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నమ్మి రాధ అనే కార్మికురాలు తన చేతిపై జగన్ బొమ్మను పచ్చ బొట్టు వేయించుకున్నారు.
సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తమ ఉద్యోగాలురెగ్యులరైజ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే రెగ్యులరైజ్ చేయకపోగా అసలు ఉద్యోగాల నుంచి తీసేయాలని నిర్ణయించారు. దీంతో వారంతా ఆందోళన చేస్తున్నారు. చివరికి ఆ ఆందోళన అరెస్టుతో ముగిసింది. ఎంతో నమ్మకంగా ఓట్లేయించుకుని నట్టేటముంచారని ఆమె విలపిస్తున్న తీరు అందర్నీ ఆవేదనకు గురి చేస్తోంది. అందరిదీ అదే పరిస్థితి అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.