ఓదార్పు యాత్రలు చేసిన రాజకీయమో.. అంతకు మించిన వ్యూహమో కానీ తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిల “ఆత్మహత్య”లు ఎక్కడ జరిగితే అక్కడ తక్షణం వాలిపోతున్నారు. అది నిరుద్యోగి ఆత్మహత్యనా.. లేకపోతే రైతు ఆత్మహత్యనా అన్నది తర్వాతి విషయం. ముందుగా చురుకుగా కదులుతున్నారు. అందరి కన్నా ముందుగా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తమకు మాత్రమే సాధ్యమయ్యే దీక్షలను అప్పటికప్పుడు చేస్తున్నారు. ఈ వేగం సంప్రదాయ తెలంగాణ రాజకీయ నేతలు అందుకోలేకపోతున్నారు.
ఇటీవల నిరుద్యోగుల ఆత్మహత్యలు తగ్గి.. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వరి రైతులు కళ్లాల్లో చనిపోవడం.. పురుగు మందులు తాగడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో రవికుమార్ అనే రైతు తన చావుకు కేసీఆర్ కారణం అన్నట్లుగాలేఖ రాసి ప్రాణాలు తీసుకున్నారు. ఆ వార్త అలా బయటకు రాగానే ఇలా షర్మిల వెంటనే మెదక్ జిల్లాలోని రవికుమార్ఇంటికి వెళ్లిపోయారు. పరామర్శించి ఊరుకోలేదు.. వెంటనే అక్కడ దీక్షకు కూర్చున్నారు. మూడు గంటలు చూసి పోలీసులు ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తరలించాల్సి వచ్చింది.
ఇప్పటికే షర్మిల ప్రతి మంగళవారం.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించి దీక్షలు చేయడం అనే కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కాస్త విరామం ఇచ్చారు. అయితే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం వదిలి పెట్టడం లేదు. కానీ షర్మిల ఇలా ఆత్మహత్యలను రాజకీయం చేసుకోవడం చూసిన వాళ్లంతా ఏపీలోని పరిస్థితులే గుర్తు చేసుకంటున్నారు.. అక్కడే మైనస్ అవుతోంది.