చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అంతమొందిస్తే రూ. యాభై లక్షలు ఇస్తామని తెలంగాణలో టీఆర్ఎస్కు చెందిన ఓ కార్పొరేటర్ చేసిన ప్రకటనను వైసీపీ నేతలు ఎందుకో కానీ మర్చిపోలేకపోతున్నారు. తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఈ అంశం ఇప్పటికీ ఏపీలో మంటలు రాజేస్తూనే ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. మల్లాది వాసుకు కృతజ్ఞతలు చెబుతూ అనంతపురం జిల్లా పెనుకొండలో చాలా చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని ఎవరు పెట్టారో ఎవరికీ తెలియదు.
దీని వెనుక ఏదో పెద్ద ప్లానే ఉందని అనుకుంటున్న వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెరపైకి వచ్చారు. తాము ఖాళీగా కూర్చుంటామా అని వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆపలేదు.. చంద్రబాబునాయుడు జగన్మోహన్ రెడ్డి ని హత్య చేసి సీఎం అవ్వాలనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని చేసింది తప్పయితే.. మల్లాది వాసు చేసింది కూడా తప్పేనని..ఆయన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని అంటున్నారు.
మల్లాది వాసుపై వైసీపీ నేతలు రోజుకొకరు చొప్పున ప్రకటనలు చేయడమే కాదు.. ఆయనను అరెస్ట్ చేయాలనిచాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ఓ టీఆర్ఎస్ కార్పొరేటర్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతలు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కావాలనే ఈ అంశాన్ని లైవ్లో ఉంచుతున్నారన్న అభిప్రాయం చాలా మందిలో వినిపిస్తోంది.