టీఆర్ఎస్ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఏం చేయాలో.. ఎలా చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఎవరితోనూ కలిసేది లేదని చెబుతున్నా ఢిల్లీలో మాత్రం ఇప్పుడు ఏదో ఓ పార్టీతో కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మొన్నటిదాకా బీజేపీకి సన్నిహితంగా ఉన్నట్లుగా ఉన్నా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరవుతోంది. 2004 లోక్సభ, శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. 2009 టీడీపీతో చేతులు కలిపింది. బీజేపీతో మాత్రం ఇంత వరకూ అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. దీనికి కారణం బీజేపీకి తెలంగాణలోఅంత బలం ఇప్పటి వరకూ లేదు.
ఏడేళ్ల కాలంలో కేసీఆర్ మోడీని, బీజేపీని విమర్శించిన సందర్భాలు చాలా తక్కువ. కేంద్రంతో, బీజేపీతో సఖ్యంగానే ఉన్నారు. అన్ని సందర్భాలలోనూ చట్టసభలలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు టీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలోనూ ఆ పార్టీకే మద్దతునిచ్చింది. బీజేపీతో ముప్పు లేదనుకుని అలా మద్దతిచ్చి ఉంటారని అనుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితి మారింది. దుబ్బాక లో గెలిచిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ మంచి ఫలితాలనే సాధించింది. హుజురాబాద్లో గెలుపుతో ఇక కుంభస్థలాన్ని కొట్టాలని ప్లాన్ చేసుకుంటోంది.
దీంతో కేసీఆర్ తన వ్యూహం మార్చారు. బీజేపీ ఓ హంతక పార్టీ అని, మోడీది రైతు వ్యతిరేక రాబందు ప్రభుత్వమని, ఏడేళ్ల పాలనలో దేశంలో ఆకలికేకలు పెరిగాయని దుమ్మెత్తిపోస్తున్నారు. 14 విపక్ష పార్టీల సమావేశానికి కేకేను పంపి ఇకముందు తమ పార్టీ ఎన్డీఏ వైపు ఉండబోదన్న సంకేతాలను పంపించారు. తనకున్న పాత పరిచయాలను ఉపయోగించి కేకే సీనియర్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం చేస్తున్నారు. అయితే కేసీఆర్ను నమ్మేందుకు పార్టీలు సిద్ధంగా లేవన్నది ఢిల్లీలో ఎక్కువగా వినిపిస్తున్నమాట. కానీ కేసీఆర్ మాత్రం తాను చేయాల్సిన రాజకీయం చేస్తూనే ఉంటారు.