భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత హైరానా పడుతోందో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఎదురవుతున్న గడ్డు పరిస్థితులే కారణం. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న సమయంలో బయటకు వస్తున్న కొన్ని కీలకమైన సర్వేలు బీజేపీ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని వెల్లడిస్తున్నాయి. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ సాధికారికంగా గెలిచే పరిస్థితి లేదని చెబుతున్నాయి. కానీ బొటాబొటి మెజార్టీతో అయినా బీజేపీకే చాన్స్ అని సర్వేలు చెబుతున్నాయి. ఇంకా మూడు నెలలు ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే.. మూడు నెలల్లో పరిస్థితి మరింత దిగజారితే కష్టమేనన్న అభిప్రాయం బీజేపీలోనే వినిపిస్తోంది.
403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుస్తుంది కానీ 200కి కాస్త ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు లెక్కలు చెబుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ .. అధికారిగానికి దగ్గరగా ఉందని.. మూడు నెలల్లో సీన్ మారితే.. అఖిలేష్‌కే కిరీటం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరో కీలక రాష్ట్రం పంజాబ్‌లో బీజేపీ ఉనికి లేదు. మిత్రపక్షంగా ఉన్న అకాలీదశ్ కూడా కటిఫ్ చెప్పేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకున్నారు. కానీ వారి ప్రభావం ఏ మాత్రం ఉండే అవకాశం లేదు. అక్కడ బీజేపీ ఖాతా తెరవడమే గొప్ప.
ఇక ఉత్తరాఖండ్‌పై బీజేపీ ఎప్పుడో ఆశలు వదిలేసుకుది. మూడు సార్లు ముఖ్యమంత్రులను మార్చింది. తీవ్రమైన అధికార వ్యతిరేకత ఉంది. దీంతో అక్కడ బీజేపీ పరిస్థితి తీసి కట్టయింది. ఇక చిన్న రాష్ట్రం గోవాలో మనోహర్ పారీకర్ తర్వాత నాయకుడు లేకుండా పోయారు. అయితే చాలా మంది కాంగ్రెస్ నేతల్ని చేర్చుకోవడంతో ఈ సారి కూడా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. కానీ ఆమ్ ఆద్మీ అక్కడ ఎదుగుతోంది. ప్రత్యర్థుల బలహీనతలేఅక్కడ బీజేపీ బలం. ఇక ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బీజేపీ సంకీర్ణం అధికారంలో ఉంది. ఈ సారి అక్కడ కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కనిపిస్తోంది.