మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు నుంచి మరో ప్రకటన వచ్చింది. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు విష్ణు ప్రకటించారు. రాజీనామాలు చేయొద్దని, పంపిన లేఖలు వెనక్కి తీసుకోవాలని తాము ఇప్పటికే ఆ సభ్యులను కోరినప్పటికీ వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదిస్తున్నానని చెప్పుకొచ్చారు. మా అసోసియేషన్ పనుల కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నామని, అయితే రాజీనామా చేసినవారందరూ ‘మా’ సభ్యులుగా కొనసాగుతారని వివరించారు. అలాగే మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయని, వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చారు.
ఈసారి ‘మా’ ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికలంతా సీరియస్ గా జరిగాయి. అధ్యక్ష పదవి కోసం జరిగిన పోరులో ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. విష్ణు ప్యానల్ సభ్యులతో కలిసి పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. తర్వాత ఇరు పక్షాలు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకరి ఒకరు విమర్శలు చేసుకున్నారు. రాజీనామా చేసిన తాము బయట నుంచి ‘మా’ ఎలా పని చేస్తుందో చూస్తామని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మంచు విష్ణు ఎన్నికల ముందు తన సొంత డబ్బులతో ‘మా’కు భవనం నిర్మస్తామని మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో విష్ణు ఫ్యానల్ పనితీరుపై ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓ కన్ను వేసి వుంచింది. ఇప్పుడు రాజీనామల ఆమోదంతో మళ్ళీ ‘మా’ తెరపైకి వచ్చింది.