అప్పులు ఉన్నాయని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌కు రూ. ఆరు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారా అని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులోఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి సంఘిభావ దీక్ష చేశారు. దీక్షముగించిన తర్వాత ఏపీ సర్కార్‌ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు.
తల్చుకుంటే కేంద్రమంత్రిని కాగలను.. కానీ ఓ తరం గెలవాలి !
తాను తల్చుకుంటే ఒక్కడిని కేంద్రమంత్రిని కాగలనని.. తాను ఒక్కడినే గెలిచేందుకు రాజకీయాల్లోకి రాలేదని పవన్ స్పష్టం చేశారు. ఓ తరం గెలవాలన్నారు. పాతిక కేజీల బియ్యం కాదు.. పాతికేళ్ల భవిష్యత్ కావాలన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని విశాఖ నుంచి మాట్లాడితే వైసీపీకి వినిపించలేదని మంగళగిరి నుంచి మాట్లాడితే వినిపిస్తుందేమో చూడాలన్నారు. ప్రైవేటీకరణకు అప్పు అనేది ప్రాతిపదిక అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు ఈరోజున రూ.6లక్షల కోట్ల అప్పు ఉంది. మరి ఆంధ్రప్రదేశ్‌ను కూడా ప్రైవేటీకరణ చేస్తారా? అని ప్రశ్నించారు. గతంలో పాదయాత్ర చేసినట్లుగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
ఓటు అనే చినుకును వైసీపీకి వేసి జీవితాలను ఆవిరి చేశారు !
ప్రత్యేక హోదాకోసం నేను పోరాడితే జనం మద్దతివ్వలేదని పవన్ అన్నారు. తనను అందరూ ఐడియలిస్టిక్ ఫూల్‌గా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. చప్పట్లు కొట్టి వెళ్లిపోతే సమస్యలు పరిష్కారం కావని.. వైసీపీ నేతల చొక్కాలు పట్టుకుని నిలదీయాలన్నారు. ఓట్లు వేయించుకున్న వైసీపీకి స్టీల్ ప్లాంట్ బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఓటు అనే చినుకును వైసీపీకి వేసి జీవితాలను ఆవిరి చేశారని.. ఈ ఓటు అనే చినుకును జనసేన అనే ఆల్చిప్పలో వేయండి..మీ జీవితాలు మెరుస్తాయని హామీ ఇచ్చారు.
నా ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని చూస్తున్నారు !
తన ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని చూస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. దామోదరం సంజీవయ్యకు చిన్న స్మారకం నిర్మించలేని వారు.. కర్నూలు రాజధానిగా చేస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. దామోదరం సంజీవయ్య స్మారకానికి రూ. కోటి ఇచ్చానని.. తన సినిమాలు ఆపేసి.. తన ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని చూశారని రవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సిని మా వ్యాపారంపై అసత్యాలు చెబుతున్నారని.. మీరు అమ్మే మద్యానికి పారదర్శకత ఉందా అని పవన్ ప్రశ్నించారు. రూ.700తో మద్యం కొనమంటున్న ప్రభుత్వం రూ. ఐదుతో సినిమాలకు వెళ్లమంటందన్నారు. వైసీపీ దౌర్జన్యాలు అక్రమాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. చొక్కా పట్టుకుని నిలదీయక పోతే వాళ్లు మాట వినరన్నారు.
చేతకాని ఎంపీలు ఎందుకు !?
వైసీపీ 22 మంది ఎంపీలు ఉన్నారు. చేతగాని వాళ్లు చట్టసభలో ఎందుకు? అని పవన్ ప్రశఅనించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డకుంటామని పార్లమెంట్లో ప్లకార్డు పట్టుకునే దమ్ముందా? అని ప్రశఅనించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడుతున్నారు… రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
అమరావతి రాజధానిగా ఉంటుందని అమిత్ షా చెప్పారు !
అమరావతిని రాజధానిగా గుర్తిస్తామని అమిత్ షా తనతో చెప్పారని పవన్ కల్యాణ్ తెలిపారు. అమరావతి రైతులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ముగింపు సభకు రావాలనికోరారు. హాజరయ్యే విషయంలో హామీ ఇచ్చినట్లుగా రైతులు చెప్పుకున్నారు కానీ జనసేన కానీ.., పవన్ కానీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అమిత్ షానే అమరావతి రాజధానిగా ఉటుందనితనకు చెప్పారని ప్రసంగంలో చెప్పడంతో అమరావతి రైతులకు మరింత ధైర్యం వచ్చినట్లవుతుంది.