ఏపీ ప్రభుత్వం తగ్గించిన సినిమా టికెట్ల ధరపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, భూ నిర్వాసితులకు మద్దతుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ సినిమా టికెట్ల వ్యవహారాన్ని ప్రస్తావించారు. ”నా ఆర్ధిక మూలాలలు దెబ్బకొట్టాలని చూశారు. నా సినిమాలు ఆపేసినా నేను భయపడను. పంతానికి దిగితే ఏపీలో నా సినిమాలు ఉచితంగా చూపిస్తా. సినిమా టికెట్లకు ట్రాన్సఫరెన్సీ లేదంటున్నారు. మరి మీరు అమ్మే మద్యానికి ట్రాన్సఫరెన్సీ వుందా ? ట్రాన్సఫరెన్సీ అందరి విషయంలో వుండాలి. రూ.700 లతో మద్యం కొనండి, రూ.5తో సినిమాకి వెళ్ళండి అని చెబుతున్నారు” అంటూ సెటైర్లు వేశారు పవన్ కళ్యాణ్.
ఏపీలో టికెట్ల ధర తగ్గించడం టాలీవుడ్ తో పాటు రాజకీయంగా కూడా చర్చనీయంశమైన సంగతి తెలిసిందే. బడా హీరోల, పెద్ద సినిమాలు ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో నష్టపోతాయనే మాట ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఫాలోయింగ్ వున్న హీరోల సినిమాలకు ప్రిమియర్, బెన్ఫిట్ షోలకు అనుమతి నిరాకరించడం కూడా చర్చనీయంశమైయింది. ఇదే అంశంపై రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని రాజేశాయి. ఇప్పుడు మరోసారి టికెట్ల ప్రస్థావన తెచ్చారు పవన్ కళ్యాణ్. మరి ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.