తెలంగాణ సీఎంగా రెండో సారి బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ సారి ఆయన తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంను ఎంచుకున్నారు. ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులందరితో కలిసి ఆయన శ్రీరంగం వెళ్లి స్వామివారిని దర్శించుకుని రాత్రికి చెన్నైలోనే ఉంటారు. వెంటనే తిరిగి రావొచ్చు కానీ.. రాత్రికి చెన్నైలోనే ఎందుకు ఉంటున్నారు అన్నది కాస్త సస్పెన్స్. ఆయన ఎవరితో అయినా సమావేశం అవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
కానీ కాస్త ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటే కేటీఆర్ తాము త్వరలో తమిళనాడుకు వెళ్లి అక్కడి డీఎంకే పార్టీ నిర్మాణాన్ని పరిశీలించబోతున్నామని ప్రకటించారు. తనతో పాటు మంత్రులు కీలక నేతలు వస్తారని చెప్పారు. టీఆర్ఎస్కు లేనంత పార్టీ నిర్మాణం డీఎంకేకు ఏముందని.. అక్కడకు వెళ్లి అందరూ పరిశీలించేదేమిటన్న విశ్లేషణలు అప్పుడే వచ్చాయి. అదే సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ … కేసీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటూ ఓ అంశాన్ని బయట పెట్టారు. దాని ప్రకారం డీఎంకేతో కలిసి కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్లాన్ చేస్తున్నారు. కేటీఆర్‌ను సీఎం ను చేయడం ఇందులో భాగమని ఆయన చెప్పారు. అది ఉహాగానమో… అర్వింద్ జోస్యమో ఎవరికీ తెలియదు. కానీ కేసీఆర్ తమిళనాడు టూర్‌కు వెళ్లడం.. కొన్ని సీక్రెట్ మీటింగ్స్ ఉన్నాయన్న ప్రచారం నేపధ్యంలో మళ్లీ అవన్నీ గుర్తుకు వస్తున్నాయి.
కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి అధికారికంగా ఒక్కరితో కూడా సమావేశం కాలేదు. కానీ అంతర్గతంగా ఆయన చాలా మందితో చర్చించారని చెబుతున్నారు. అదంతా రాజకీయమేనని అంటున్నారు. ఈ క్రమంలో గతంలోలా జాతీయ రాజకీయాల కోసం.. బహిరంగంగా కాకుండా అంతర్గతంగా పర్యటనలు చేస్తున్నారని… అన్నీ సెట్ అయిన తార్వాత అధికారికంగా ఈ పర్యటనల ఫలాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ అంత ఖాళీగా లేరని.. చాలా సీరియస్‌గానే వర్కవుట్ చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది.