స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పవన్ కల్యాణ్ అమరావతిలో దీక్ష చేశారు. దీక్షచేయడానికి ముందే వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉంటే అమరావతిలో దీక్ష ఏంటి అని విమర్శలు చేశారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తోంది మోడీ అని.. ఆయనను నిలదీయాలని.. ఆ ధైర్యం లేదా అని విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. వ్యక్తిగత విమర్శలు వైసీపీ పాలసీలో భాగం కాబట్టి వాటిని పక్కన పెడితే.. ప్రధానంగా చేసిన ఆరోపణ మోడీని పవన్ నిలదీయడం.
పవన్ కల్యాణ్‌కు ఒక్క ఎంపీలేరు.. ఒక్క ఎమ్మెల్యే లేరు. కానీ ఆయన నిలదీయాలని అంటున్న పార్టీ అధికార పార్టీ. ప్రజా సమస్యలుపరిష్కరిస్తామని.. రాష్ట్రాన్ని కాపాడుతామని.. రాష్ట్ర హక్కులు.. ప్రజల హక్కులు కాపాడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ వారు మాత్రం నోరు మెదపడం లేదు. ఆ పార్టీకి పార్లమెంట్లో 22 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నోరుమెదపడం లేదు. రాజ్యసభలోనూ కిక్కురుమనడం లేదు.
అసలు బాధ్యత ఉన్న వైసీపీ నేతలు నోరు తెరవనప్పుడు.. ఏ మాత్రం ఎంపీలు..ఎమ్మెల్యేలు లేని పవన్ కల్యాణ్ మోడీని నిలదీస్తే ఏం ప్రయోజనం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంపై దండెత్తి.. తమ బలం సరిపోదు.. మీరు కూడా కలిసి రండి అనిఇతర పార్టీలు ఆహ్వానిస్తే.. వారు రాకపోతే వారి చిత్తశుద్ధిని శంకించాలి. కానీ ఇక్కడ అధికార పార్టీ మాత్రం కేసుల భయంతోనే..మరో కారణంగానే కేంద్రం దగ్గర సారగిలపడిపోయి… ప్రశ్నిస్తున్న ఇతరులను మాత్రం కించ పరుస్తోంది.
కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందా… కొద్దిగా మెజార్టీ ఉందా అన్నది అసలు విషయం కాదు. ఉన్న బలంతో కేంద్రంపై ఎంత పోరాడారు అన్నదే కీలకం. ప్రజలు ఇచ్చిన అధికారంతో చేతులు కట్టుకుని కూర్చుని ఇతరుల్ని నిందించడం సులభం.. పని చేయడమే కష్టం. ఆ విషయాన్ని వైసీపీ నిరూపిస్తోంది. ఓట్లేసిన ప్రజల్ని తల దించుకునేలా చేస్తోంది.